హైదరాబాద్, ఆంధ్రప్రభ: అందరికీ నాణ్యమైన ఉచిత అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శాసనసభలో పద్దులపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య సీఎం కేసీఆర్ చిరకాల స్వప్నమని, దీన్ని అమలు చేసేందుకు అంచలంచలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురుకులాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, పాఠశాల స్థాయిలోనే కాకుండా కళాశాల స్థాయిలో, న్యాయ విద్య స్థాయిలోనూ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 973 గురుకులాలు ఉన్నాయని, వీటిల్లో విద్యాభ్యాసం చేస్తున్న ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా లక్షా 20 వేల రూపాయలను వెచ్చిస్తోందన్నారు. గురుకులాలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులలో 489 మంది ఐఐటీకి ఎంపిక కాగా, 850 మంది ట్రిపుల్‌ఐటీలో సీట్లను సంపాదించారన్నారు. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులను మళ్ళించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 8 వ తరగతి వరకు ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని 10 వ తరగతి పెంచడం, బాత్రూంలతో పాటు స్కూల్ భవనాలను ఆకర్షించేలా తీర్చిదిద్దడం, ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు బోధనపై తర్ఫీదు ఇవ్వడం లాంటివి పెద్ద ఎత్తున చేస్తున్నామన్నారు.
ఆంగ్లం మాధ్యమంగా బోధన జరగాలని నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఈ నెల14 వ తేదీ నుంచి శిక్షణా తరగతులను దశల వారిగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 194 మాడల్ స్కూల్స్‌ను కూడా తీర్చిదిద్దుతున్నామన్నారు. కరోనా కాలంలో ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలల బోధనే బాగా జరిగిందన్నారు. ఆన్‌లైన్ బోధన కోసం 67 వేల వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి విద్యను అందించడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దూరదర్శన్ ద్వారా పాఠాలను బోధించామన్నారు.
మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందన్నారు. పాఠశాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలతో పాటు ప్రహారీల నిర్మాణం, డైనింగ్ హాల్ నిర్మాణం, బాత్రూంల నిర్మాణం తదితర వాటి కోసం ప్రజల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించామన్నారు. రూ. 2 లక్షలు ఇస్తే పాఠశాల కమిటీ మెంబర్‌గా ఉండే అవకాశం ఉందని, ప్రాథమిక పాఠశాలకు రూ. 25 లక్షలు, మాధ్యమిక పాఠశాలకు రూ. 50 లక్షలు, ఉన్నత పాఠశాలకు కోటి రూపాయలు ఇస్తే దాతల పేర్లను పెడతామన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయన్నారు.
కేజీ టు పీజీ ఉచిత విద్యకు ప్రాధాన్యం, గురుకులాల్లో నాణ్యమైన విద్య: సబితా ఇంద్రారెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement