హైదరాబాద్ : కార్పోరేట్ కు దోచిపెట్టేందుకు దేశాన్ని చీకట్లోకి నెట్టేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. దేశంలోని విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటిపోతుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ధర్మల్ కేంద్రాల్లో 20రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలని, కానీ నేడు ఒకట్రెండు రోజులకు సరిపడే బొగ్గు మాత్రమే ఉందని సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటీ ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు.
100 ఏళ్లకు సరిపడా బొగ్గు మన నేలలో ఉన్న వాటిని వెలికితీయడంలో కేంద్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. మన గనుల్లోనే సరిపడా బొగ్గు ఉన్న వాటిని తవ్వకుండా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని ధర్మల్ కేంద్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తుందన్నారు. కావాలనే బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్ధలకు కాకుండా ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తుందని దుయ్యబట్టారు. కార్పోరేట్ కు విద్యుత్ రంగాన్ని అప్పగించేందుకే ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రాలను కావాలనే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరెంటు కోతలు పెడుతున్న సీఎం ముందు చూపు వల్లే రాష్ట్రంలో కరెంట్ కష్టాలు దరి చేరట్లేదని వివరించారు. గృహ వినియోగానికే కాకుండా వ్యవసాయ రంగానికి సైతం నిర్విరామంగా 24 గంటల కరెంట్ అందిస్తున్నట్లు తెలిపారు.