Friday, November 22, 2024

WGL: మావోయిస్టుల తలలకు వెల…

నక్సల్స్ ఫోటోలతో వాల్ పోస్టర్లు
సమాచారం తెలిపితే నగదు బహుమతి ప్రకటించిన పోలీసులు

మంగపేట, జూన్ 5 (ప్రభ న్యూస్) : నిషేధిత మావోయిస్టుల ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను బుధవారం ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో పలు చోట్ల పోలీసులు అతికించారు. బిల్ట్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ తో పాటు గ్రామంలోని పలు మెయిన్ సెంటర్లలో మావోయిస్టుల ఫోటోలు ముద్రించి ఉన్న వాల్ పోస్టర్లను మంగపేట ఎస్సై గోదరి రవి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అతికించారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డుకట్ట వేస్తున్నారని పోలీస్ శాఖ పేర వెలసిన ఈ వాల్ పోస్టర్ లో మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వారికి 1లక్ష రూపాయల నుండి రూ.20 లక్షల వరకు నగదు బహుమతి అందిస్తామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వాల్ పోస్టర్లలో పోలీసులు పేర్కొన్నారు.

కాగా జిల్లాలోని వాజేడు మండల పరిధిలోని కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఇటీవల ఇల్లందుల యేసు అనే వ్యక్తి మృతి చెందడం, దానిని నిరసిస్తూ ఇల్లందుల యేసు కుటుంబానికి మద్దతుగా బుధవారం వాజేడు, వెంకటాపురం మండలాల నుండి పలు గ్రామాల నుండి ప్రజలు పెద్దఎత్తున కదలి వచ్చి మావోయిస్టులకు వ్యతిరేకంగా జగన్నాధపురం గ్రామంలో వై జంక్షన్ నుండి హనుమాన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో మావోయిస్టుల ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లు పోలీసులు అతికించడం చర్చనీయాంశమైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement