మక్తల్, మార్చి13(ప్రభన్యూస్) : ముంపు బాధితులకు కూలీ డబ్బులు చెల్లించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో లెవల్ కెనాల్ కోసం 500 మీటర్ల బండ తొలగి పనులకు బుధవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
సంగంబండ గ్రామానికి చెందిన ముంపు బాదితులకు చెల్లించాల్సిన కూలి డబ్బులు 12 లక్షలు చెల్లించని కారణంగా 10 సంవత్సరాలుగా పనులు నిలిచిపోయాయని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు నెలల్లో 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం ముంపు బాధితుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. దీంతో బండరాయి తొలగింపు పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ ,పార్లమెంటు అభ్యర్థి సీడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ,డిసిసి అధ్యక్షుడు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి, జి. గోపాల్ రెడ్డి, జి .లక్ష్మారెడ్డి ,గడ్డంపల్లి హనుమంతు ,కట్టా సురేష్ కుమార్ ,బోయ రవికుమార్ ,బి. గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.