న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీసీ గణనపై పార్లమెంట్‌లో ఉద్యమించాలని, అలాగే జాతీయస్థాయిలో బిసి గణనపై ఏకాభిప్రాయం సాధించడానికి ఈ సమావేశాల్లోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కోరారు. ఈ అంశంపై బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం శుక్రవారం పలు పార్టీల నేతలను కలిసి చర్చించింది. శుక్రవారం ఢిల్లీలోని డీఎంకే నేత, పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి కరుణానిధి, టీఆర్ఎస్ పార్లమెంట్ పక్ష నేత డాక్టర్ కె. కేశవరావు, వైసీపీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, టీడీపీ పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, కాంగ్రెస్ జాతీయ నేత అజయ్ యాదవ్‌లను కలిసి బీసీ గణనకు మద్దతివ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా జరిగే జనగణలో బీసీ గణన కూడా చేపట్టాలని దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నామని, బీసీల ఉద్యమానికి మద్దతుగా దేశంలోని 22 రాజకీయ పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశాయని, అలాగే ఏడు రాష్ట్రాల అసెంబ్లీలో ఎకగ్రీవ తీర్మానం చేశాయని జాజుల శ్రీనివాస్ తెలిపారు.
అధికారంలోకి వచ్చాక అప్పటి కేంద్ర హోంమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీసీగణన చేస్తామని పార్లమెంట్‌లో ప్రకటించి నేడు మాట మారుస్తున్నారని, బీజేపీ అవలంభిస్తున్న ద్వంద విధానాన్ని పార్లమెంట్‌లో ఎండగట్టాలని కోరారు. బీసీల న్యాయమైన డిమాండ్ల కోసం బీసీ సంఘాలు పోరాడుతున్నాయి, బీసీ సంఘాల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని కనిమొళి సహా మిగతా పార్టీల నేతలంతా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బీసీగణనతో పాటు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ క్రిమిలేయర్ ఎత్తివేత, తదితర డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జాతీయస్థాయిలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తామని, ఈ అంశాలపై పార్లమెంట్‌లో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీసీ నేతలకు వారు హామీ ఇచ్చారు.