Friday, November 22, 2024

Press Meet – వ‌ర‌ద‌ల నుంచి జంట‌ న‌గ‌రాల‌ను ర‌క్షించేందుకే మూసి ప్ర‌క్షాళ‌న – దాన కిశోర్, రంగ‌నాథ్

హైదరాబాద్‌: వ‌ర‌ద‌ల వ‌ల్ల జంట న‌గ‌రాల ప్ర‌జ‌లు న‌ష్ట‌పోకుండా ఉండేందుకే మూసీ ప్ర‌క్షాళ‌న చేప‌ట్టామ‌ని, ఈ క్ర‌మంలో ఆ ప్రాంతం నిర్వాసితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్. హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ వెల్ల‌డించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన తదితర అంశాలపై నేడు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో కలిసి దాన కిషోర్ మీడియాతో మాట్లాడారు.

”గతంలో మూసీకి వరదలు భారీగా వచ్చేవి, అప్పట్లోనూ నిర్వాసితులను తరలించారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు. ఇటీవల ఖైరతాబాద్‌లో 20 నిమిషాల్లో 9 సె.మీ కుపైగా వర్షపాతం నమోదైంది. చిన్న వర్షాలకే హైదరాబాద్‌ ముంపునకు గురవుతోంది. నగరంలో ప్రస్తుతం కోటి జనాభా ఉంది. మూసీ పరివాహక ప్రాంతం మురికికూపంలా మారింది.. దాన్ని మార్చాలి. మూసీకి వరదలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే. కుచించుకుపోయిన మూసీని విస్తరించడమే మా లక్ష్యం. మూసీ సుందరీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకొని క్షేత్ర పర్యటనకు వెళ్తాం అని చెప్పారు.

- Advertisement -

55 కి.మీ పొడవైన ఈస్ట్‌, వెస్ట్‌ కారిడార్లు నిర్మిస్తాం

2030 కల్లా హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2026 జూన్‌ లోపు మూసీ నదిలో మంచినీరు ప్రవహించాలని సీఎం ఆదేశించారు. నదిలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు రూ.3,800 కోట్లు వ్యయం చేస్తున్నాం. మూసీ రివర్‌ఫ్రంట్‌ పక్కనే పార్కులు, పార్కింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. 55 కి.మీ పొడవైన ఈస్ట్‌, వెస్ట్‌ కారిడార్లు నిర్మిస్తాం. దీంతో నగరంలో ట్రాఫిక్‌ తగ్గుతుంది.

3 నెలల క్రితం మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ అధికారులు 55 కి.మీ మేర డ్రోన్‌ సర్వే చేసి దాదాపు 10,600 ఇళ్లు, నిర్మాణాలు.. బఫర్‌ జోన్‌, రివర్‌బెడ్‌లో ఉన్నాయని గుర్తించారు. ఏదో ఒక రోజు వారిని ఖాళీ చేయించాల్సిందే. నిర్వాసితుల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశాం. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయిస్తాం. ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల నుంచి 30లక్షల విలువ చేసే ఇళ్లు ఇస్తున్నాం. నిర్వాసితుల్ని ఎవరినీ బలవంతంగా తరలించలేదు. వారితో సామరస్యంగా మాట్లాడే డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లకు తరలిస్తున్నాం. హైడ్రా అధికారులు చట్టానికి లోబడే పనిచేస్తున్నారు. మూసీ ఆధునికీకరణకు ప్రజలందరూ సహకరించాలి” అని విజ్ఞప్తి చేశారు.

చిన్న వర్షానికే సచివాలయం ముందు అంత వరద ఎన్నడూ చూడలేదు. భారీ వర్షపాతం నమోదు అయితే అధికారులు కూడా ఏం చేయలేరు అని దాన కిషోర్ అన్నారు. ప్రజల కోసమే మూసీ అభివృద్ధి అని వెల్లడించారు. కేవలం మూసీని బ్యూటిఫికేషన్ చేయడం కోసమే ఈ చర్యలు తీసుకోవడం లేదు. గతంలోనూ నిర్వాసితులను తరలించారు. గత వరదలతో భారీ ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. గతంలో మూసీ సుందరానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు చేశారని తెలిపారు. మూసీ వరదల వల్ల బాధపడేది ప్రజలే. ప్రజల కోసమే మూసీ అభివృద్ధి అని దాన కిషోర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement