Thursday, November 21, 2024

Press Meet – కాంగ్రెస్ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే…రేవంత్ వ్యాఖ్యాల‌తోనే తెలంగాణ‌కు న‌ష్టం – కెసిఆర్

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ అవాస్తవాలు చెబుతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాల కోసం అమూల్యమైన సమయాన్ని వృథా చేసిందని విమర్శించారు. నాలుగైదు నెలల కాలంలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్ తక్కువ దృష్టి పెట్టిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన కొత్తలో కరెంట్ కోతలు బాగా ఉండేవన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో విద్యుత్ కోతలను పరిష్కరించామన్నారు.

కాంగ్రెస్ సరూర్ నగర్ సభకు కనీసం 3 వేలమంది ప్రజలు కూడా హాజరు కాలేదన్నారు. కాంగ్రెస్ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను తాము పవర్ ఐలాండ్‌గా మార్చామన్నారు. కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలు అన్నీ తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పక్కకు జరగగానే కరెంట్ కష్టాలు ఎందుకు ప్రారంభమయ్యాయని ప్రశ్నించారు. కష్టపడి బతికే కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు.

- Advertisement -

పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని… కానీ ఏ సంవత్సరం ఆగస్టో చెప్పాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాటేస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత జోష్ కాంగ్రెస్ నేతల్లో ఇప్పుడు లేదన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారి బకాయిలు కూడా చెల్లించడం లేదన్నారు. తాను చేనేత కార్మికుల కోసం ఏదో వ్యంగ్యంగా మాట్లాడితే తన గొంతును 48 గంటలు బంద్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోతే వార్త అన్నట్లుగా ఉండేదన్నారు. వరికి బోనస్ మొత్తాన్ని ఇవ్వడం లేదన్నారు.

కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాలుగైదు నెలల్లోనే రాష్ట్రం రూపు రేఖలను మార్చేశారని అన్నారు. ఇప్పుడు ప్రజల ఆలోచన మారిందన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో కనిపించిన జోష్.. ఇప్పుడు కనిపించడం లేదని జోస్యం చెప్పారు. ప్రభుత్వం భేషజాలకు వెళ్లి చాలా నష్టపోయిందన్నారు.

వైఎస్సార్ హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీని, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను.. తామూ కొనసాగించామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ కోతలు పెరిగాయని, నీటి కొరత ఏర్పడిందని ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంగా అభివర్ణించారు. గత తొమ్మిదేళ్లలో లేని కరెంట్ కోతలు, నీటి ఎద్దడి ఇప్పుడు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. ఒకసారి తాను ఉన్న ప్లేస్ లోనే కరెంట్ కట్ అయితే.. ట్వీట్ చేశానన్న కేసీఆర్.. ప్రభుత్వం పట్టించుకోదని పదే పదే చేయడం మానేసినట్లు చెప్పారు. తాను వెళ్లిన 7-8 ప్రాంతాల్లో కరెంట్ కట్ అయిందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చిన తెలంగాణలో ఇప్పుడు కరెంట్ కోతలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సింగరేణిలో బొగ్గు కొరత లేదు, నీటి కొరత లేదు, ఎలాంటి కొరత లేకుండా కరెంట్ కట్ ఎందుకు కట్ అవుతుందని మీడియా ముఖంగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో 6-7 గంటలు కరెంట్ కట్ చేశారని వాపోయారు. ప్రగతి, పెట్టుబడులు, ఐటీ కంపెనీల తీరుతెన్నులు గమనించి హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ చేశానని, న్యూయార్క్ లో లండన్ లోనైనా పవర్ పోద్దేమో గానీ.. హైదరాబాద్ లో పవర్ పోదనే స్థాయికి తీసుకొచ్చానని.. మళ్లీ హైదరాబాద్ కు పవర్ కట్స్ మొదలయ్యాయని చెప్పుకునే స్థాయికి కాంగ్రెస్ తీసుకొచ్చిందని విమర్శించారు.

కరెంట్ లేక లక్షల ఎకరాల్లో పంట నష్టం, మోటార్లు కాలిపోవడం దురదృష్టకరమన్నారు. రైతులు కూడా కరెంట్ షాక్ లు తగిలి మరణించార‌ని,. మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా పాడైందని వాపోయారు కేసీఆర్. ప్రతి వేసవిలో తెలంగాణలో మంచినీటి ఇబ్బంది ఉండకూడదని మిషన్ భగీరథను తీసుకొచ్చాం. వీధి కుళాయిలు లేకుండా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చాం. దొంగతోపు వంటి గూడెంకు కూడా నీటిని సప్లై చేశాం. వాటర్ బిజినెస్ ఆగింది. 3-4 నెలల్లో మళ్లీ మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. దూరప్రాంతాల నుంచి బిందెలు మోస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగైదు నెలల్లోనే.. కరెంట్ సరిగ్గా లేదు, మంచినీటి సరఫరా లేదు. మరి ప్రభుత్వం ఏం చేసిందని కేసీఆర్ నిలదీశారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కాపాడలేకపోయింది. 9 ఏళ్లుగా ఉన్నవి ఇప్పుడు ఏమయ్యాయని అడిగారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని నిలబెట్టకపోగా మళ్లీ ప్రజల జీవితాలను తొమ్మిదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement