Tuesday, November 19, 2024

వినాయక నవరాత్రులకు.. వాటర్‌ బోర్డు సన్నాహాలు

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : మహానగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈనెల 31 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచినీటి సరఫరా, సీవరేజీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని వాటర్‌బోర్డు ఎం.డి దానకిషోర్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఖైరతాబాదులోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభాని కంటే ముందే సీవరేజ్‌ నిర్వహణ చర్యలు పూర్తి చేయాలన్నారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఎక్కడా సీవరేజీ ఓవర్‌ ఫ్లో సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడైనా సీవరేజీ సమస్యలు ఉత్పన్నమైన వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎయిర్‌ టెక్‌ మిషన్లు రెండు షిఫ్టుుల్లో అందుబాటులో ఉంచాలన్నారు. అంతేకాకుండా ధ్వంసమైన మ్యాన్‌ హోళ్లను, మూత లేని మ్యాన్‌ హోళ్లను వెంటనే గుర్తించి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎక్కడా పైప్‌ లైన్‌ లీకేజీలు లేకకుండా చూడాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు, వినాయక మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని ప్రత్యేకంగా అధికారులను ఆదేశించారు.

ఉచితంగా తాగునీటి సరఫరా..

వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఉచితంగా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వాటర్‌బోర్డు ఎం.డి దాన కిశోర్‌ తెలిపారు. గతంలో కేవలం ఉత్సవాల్లో 11వ రోజున జరిగే నిమజ్జనం నాడే తాగునీటిని అందించామన్నారు. అయితే ఈ సారి మాత్రం భిన్నంగా నవ రాత్రుల్లో 3, 5, 7, 9వ రోజుల్లో కూడా నిమజ్జనాలు జరిగే కొలనుల వద్ద తాగునీటిని అందిస్తామని కూడా చెప్పారు. ఇందుకోసం తాగునీటి శిబిరాలను ఏర్పాటు చేసి తాగునీరు అందజేయనున్నట్లు చెప్పారు. మహానగరంలో 11వ రోజున నిమజ్జన శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో వాటర్‌ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement