Friday, November 22, 2024

అకాల వర్షం.. రైతులకు తీరని నష్టం – రైతులను నిండా ముంచిన వడగండ్ల వాన..

హైదరాబాద్‌, ప్రభస్యూస్ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను నట్టేట ముంచింది. జగిత్యాల, సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలతో సహా కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం నీట మునగగా చేతికొచ్చిన మామిడి పండ్లు నేలరాలడంతో కర్షకులు లబోదిబోమంటున్నారు. కల్లాలు, మార్కెట్‌ కమిటీలు, రైతు వేదికల వద్ద కోసి ఆరబోసిన ధాన్యం నీళ్ల పాలైంది. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశం ఉందని ముందే ఊహించి కల్లాలకు వెళ్లి ధాన్యంపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పేందుకు వెళ్లిన రైతులకు నిరాశే మిగిలింది. రైతులు ఆరబోసిన వరి ధాన్యాన్ని రక్షించుకునేందుకు బయలుదేరడం ఈలోపే ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చేసేదేమీ లేక వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గురువారం ఉదయం వాతావరణం పొడిగా ఉండడంతో రైతులు సమీపంలో ఉన్న మార్కెట్‌ కమిటీల్లో ధాన్యాన్ని ఆరబెట్టారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో ధాన్యమంతా నీటి పాలై కొట్టుకుపోయింది. ఆ వర్షంలోనే రైతులు కొంత ధాన్యాన్ని సేకరించి భద్రపర్చుకున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో మామిడి కాయలు రాలిపోయాయి. జిగిత్యాల జిల్లా సారంగపూర్‌, ధర్మపురిలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ధర్మారం, సుద్దాల, వేములవాడల్లో భారీ వర్షం కురిసింది. తంగళ్లపల్లి, బస్వాపూర్‌, జగిత్యాల, రాయికల్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కల్లాల వద్ద భద్రపరిచిన ధాన్యం నీటి పాలు కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. జగిత్యాల జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరి నేలకొరిగిందని అక్కడి కర్షకులు చెబుతున్నారు.

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలో వరిపంట కోసి ఎండబెట్టిన ధాన్యం నీట మునిగింది. ఈ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వడగండ్ల వానలు కురిసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా వాన కురువగా ధాన్యం నీటి పాలైంది. రైతులు హుటాహుటిన వెళ్లి కవర్లు కప్పినా వర్షం నీరు ప్రవహించడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఈదురు గాలులతో మామిడి కాయలు నేలరాలడంతో చేసేదేమీ లేక వాటిని ఏరి మార్కెట్లకు తరలిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి రహదారిలో చెట్లు కూలి ఆటోపై పడడంతో ఆ వాహనం నుజ్జునుజ్జయింది.

భారీ గాలులతో పలు ప్రాంతాల్లో ఇంటి పైకప్పులకు వేసిన రేకులు ఎగిసిపోయాయి. వెల్గటూర్‌, మల్యాల, గంగాధర మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, కోనరావుపేట మండలాల్లో వర్షం కారణంగా అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం నీట మునిగింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. ఆరబెట్టిన వరి ధాన్యం కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. రహదారి పక్కన చెట్లు నేలకూలగా ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.

- Advertisement -

హైదరాబాద్‌లో…

మే నెల రాకముందే గత కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. ఉత్తర తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎండవేడిమితో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్‌ వాసులకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉపశమనం కల్పించింది. గురువారం సాయంత్రం భాగ్యనగరంలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది.

బేగంపేట, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, ఆల్వాల్‌, లంగర్‌హౌస్‌, చిలకలగూడతో సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసినట్టు చెబుతున్నారు. మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో సంధ్యా సమయానికి ముందే చీకట్లు అలముకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ముగిసిన తర్వాత వర్షం కురవడంతో ఉద్యోగులు ఇంటికి చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement