రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందంటూ ఆదిలాబాద్‌లో మృతురాలి కుటుంబీకులు గురువారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతదేహంతో రిమ్స్ ఆసుపత్రి ఎదుట రహదారిపై బైఠాయించారు. బాధిత కుటుంబానికి మద్దతుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేశాయి. వారి ఆందోళనతో గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
వివరాల్లోకి వెళ్లితే.. గుడిహత్నూర్ మండలం సూర్యగూడకు చెందిన కుమ్ర గంగాదేవి ఐదు రోజుల కిందట రిమ్స్‌లో చేరింది. సిజేరియన్ చేసి వైద్యులు బిడ్డకు పురుడుపోశారు. అంతలోనే ఏమైందో ఏమో పరిస్థితి విషమించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు చెప్పడంతో బంధువులు హుటాహుటిన అక్కడికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు. సదరు వైద్యులపై కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన విరమింపజేయాలని పోలీసులు ప్రయత్నించినా.. వారు రహదారిపైనే బైఠాయించి నిరసన కొనసాగించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital