- ఉసిరికాయలపల్లిలో రచ్చకెక్కిన ప్రజాపాలన గ్రామసభ
- పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన గ్రామస్తులు
కారేపల్లి, జనవరి 23 (ఆంధ్రప్రభ) : పేదోళ్లు సర్కారు కట్టించే గూడుకి నోచుకోరా అంటూ కడుపు మంటతో ఆందోళనకు దిగిన సంఘటన ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఉసిరికాయలపల్లి ప్రజాపాలన గ్రామసభలో గురువారం జరిగింది. అధికారులు జాబితా చదువుతున్న సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు అర్హులుగా ఉండి తమను పట్టించుకోలేదని మహిళలు అధికారులపై మండిపడ్డారు. అధికార పార్టీ అయితే వాళ్లకు సంబంధించిన ధనవంతులకే ఇల్లు కేటాయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూడు, గూడు, గుడ్డ సక్రమంగా లేని పేదోళ్ల బాధలు కనిపించవా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులను వదిలేసి అనర్హులకు ఏ విధంగా ఇల్లు కేటాయించారని నినాదాలు చేశారు. నిజమైన పేదలను గుర్తించి వారికే ఇల్లు కేటాయించాలని కోరారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు వత్తాసు పలకకుండా పేదోళ్ల వైపు నిలవాలని పేర్కొన్నారు. ఆందోళనకారులకు సిపిఎం మాజీ సర్పంచ్లు బానోతు బన్సీలాల్, పెంటమ్మ, బిఆర్ఎస్ నాయకులు జాల సాంబ, మంగీలాల్ మద్దతుగా నిలిచారు.