ఆంధ్రప్రభ స్మార్ట్, వేములవాడ, కరీంనగర్ బ్యూరో : సుమారు అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ ఆవిర్భావించిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పలువురు మంత్రులు మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. రూ. 166 కోట్లతో వైద్య కళాశాల నిర్మించామని తెలిపారు. 4696 నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు అందజేశామని అన్నారు.
మాది చేతల ప్రభుత్వం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గతంలో మాటల ప్రభుత్వం, నేడు చేతల ప్రభుత్వం అని కొనియాడారు. దక్షిణ కాశీ రాజన్న ఆశీర్వాదంతో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిందని చెప్పారు. పది నెలల కాలంలోనే 50 వేల ఉద్యోగాలు అందించామన్నారు. హైదరాబాద్ సుందరీకరణకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఆదిలాబాద్ నుంచి ములుగు వరకు రాష్ట్రం నలుమూలల అభివృద్ధి చేశామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని అన్నదాన సత్రానికి రూ. 35.25 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
నేతన్నలకు ఉపాధి
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్న కార్మికులకు ఉపయోగపడేలా నూలు బ్యాంకు ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో నేతన్న కార్మికుల ఉపాధి కోసం బృహత్తర ప్రణాళిక రూపొందిస్తామన్నారు. పెండింగ్ ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యతతో పూర్తి చేస్తామన్నారు.
అందరి కష్టం ఫలితంగా ఇందిరమ్మ రాజ్యం
రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డిమాట్లాడుతూ మనందరి కష్టం ఫలితంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. రాబోయే 4 సంవత్సరాలలో లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులకు 236 కోట్లతో 4696 ఇండ్ల మంజూరు చేశామన్నారు. ధరణి రికార్డుల నిర్వహణను విదేశీ సంస్థ నుంచి ఎన్.ఐ.సి కు అప్పగించామని చెప్పారు. త్వరలో దేశానికే ఆదర్శంగా నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తామన్నారు.
గత ప్రభుత్వం ఎగవేసిన బకాయిలు చెల్లిస్తున్నాం…
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏగవేసిన బకాయిలు చెల్లిస్తూనే 30 సంవత్సరాల చిరకాల కోరిక నూలు డిపో ఏర్పాటు చేశామన్నారు. నేతన్న చేయూత, నేతన్న బీమా, పావలా వడ్డీ పథకాలను చేనేత కార్మికులకు అమలు చేస్తున్నామని చెప్పారు. 365 రోజులు చేనేత కార్మికులకు పని కల్పించే సంకల్పం ప్రభుత్వం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఐ.ఐ.హెచ్.టీ మంజూరు చేశామన్నారు. రాజన్న దయవల్ల దేశంలోనే అత్యధికంగా వరి పంట దిగుబడి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేశామని తెలిపారు. ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన మాటను నేడు సీఎం రేవంత్ నెరవేర్చారు అన్నారు. నిరంతరం ప్రజలలో తిరిగే శ్రమ జీవి ప్రభుత్వ విప్ వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు.