కరీంనగర్ – “ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే. నవోదయ స్కూలు ఇవ్వలే. అదేమంటే మశీదు తవ్వుతారు. గుడి తవ్వుతారు. మశీదు తవ్వేటోడు సిఫాయంట. ఎవడన్నా మశీదు తవ్వుతాడా? మతం, కులం పేరుతో పేచీలు, పంచాయితీలు తప్ప మరేం తెలీదు. బీజేపీకి ఏమీ తెలీదు. తెలిసింది మత పిచ్చి. ఇలాంటి బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. ఒక్క ఓటు కూడా వేమొద్దు,, అని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు.
కరీంనగర్ తో పాటు ఈ జిల్లాలోని హుజూరాబాద్, చొప్పదండిలలో జిరిగిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, . బీజేపీని, కాంగ్రెస్ పార్టీల దుమ్ము దులిపారు. ఆయన మాట్లాడుతుంటే కరీంనగర్ ప్రజలు కేరింతలు కొట్టారు. బీజేపీ మతం పేరిట రాజకీయాలు చేస్తోందని, ఈ పార్టీకి ప్రజలు అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఒక్కటే అనే భావన లేదన్నారు. హిందువులు ముస్లీంల పేరిట లొల్లిలు తప్ప మరో మాట ఉండదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారని, తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. పన్నులు కడుతున్నాం, మాది సాదే రాష్ర్టం, మా రాష్ర్టానికి ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలని అడిగితే కనీసం మర్యాద కోసం మోడీ చలించలేదన్నారు. చట్ట ప్రకారం ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని, కానీ 33 జిల్లాల తెలంగాణలో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఎన్ని సార్లు కోరినా,, వంద లెటర్లు రాసినా నవోదయ స్కూలు ఇవ్వలేదని, ఇలాంటి పార్టీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని కేసీఆర్ ప్రశ్నించారు.
నరేంద్ర మోడీకి బుద్ది చెప్పేందుకు 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించమన్నారు. 33 జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను తీసుకువస్తామన్నారు. కరీంనగర్కు స్థానిక ఎంపీ ఒక్క పనికూడా చేయలేదన్నారు. వినోద్ ఉన్నప్పుడు కరీనగర్కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చారని, బీజేపీ మాటలు విన్నందుకు ఐదేళ్ళు నష్టపోయామన్నారు. ఇప్పటికి సగం రాష్ర్టం తిరిగా. ప్రతి చోటా ఒకటే లొల్లి, గెలిచేది బీఆర్ఎస్సే, ఎవ్వడు ఎలా ఏడ్చినా, మొత్తుకున్నా గెలిచే బీఆర్ఎస్ పార్టీనే అని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ సుందరమయంగా మారింది. వీధులు, గొందుల్లో దూళి లేకుండా కరీనగర్ మెరిసి పోతోంది, మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తయితే కరీంనగర్ పర్యాటక కేంద్రంగా వెలిగి పోతుందన్నారు. రూ,410 కోట్లతో ప్రారంభించిన ఈ పని అభివృద్ధి కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
నెత్తి మీద డ్యామ్ ఉంది, మూడు రోజులుగా నీళ్లు రాని పరిస్థితి. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఎవరన్నా ఇచ్చారా? మనం ఇచ్చాం. అందరి ఇళ్లల్లో నల్లాలు వచ్చాయి. బిందెలతో బజారుకు పోయే పరిస్థితి లేదు. మరో కొత్త విషయం త్వరలో 24 గంటలూ నల్లా నీళ్లు ఇస్తాం అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
రాష్ర్టంలో 1019 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, వీటిని జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామని, దీంతో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, నీట్, ఐఐటీ, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధిస్తున్నారని కేసీఆర్ వివరించారు. ఓసీల్లోనూ పేదలు ఉన్నారని, వీరికి ప్రభుత్వ గురుకుల పాఠశాలలు కావాలని ఓసీలు కోరుతున్నారని, వీరికీ 119 గురుకుల పాఠశాలలను ఎన్నికల అనంతరం ప్రారంభిస్తామన్నారు.