జక్కల్, బాన్స్ వాడ : రైతు బంధు దుబారా, వృథా అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుందని మండిపడ్డారు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ . రైతుబంధు ఉండాలా? వద్దా? అని ప్రశ్నించారు. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. జుక్కల్ , బాన్స్ వాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రుణమాఫీ లేదని అన్నారు.తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని కేసీఆర్ తెలిపారు. రూ. 37 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ రెండు దఫాలుగా చేశామని చెప్పారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో కొందరికి రైతుబంధు ఆగిందని.. ఎన్నికలవగానే అందరికీ రైతుబంధు అందుతుందని పేర్కొన్నారు.
కర్ణాటకలో కరెంటు కొరతపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో 24 గంటల కరెంటు ఇస్తమని కాంగ్రెస్ ఓట్లు వేయించుకున్నది. తీరా ప్రజలు గెలిపించినంక 5 గంటలే కరెంటే ఇస్తున్నరు. దాంతో రైతులు గోస పడుతున్నరు. కరెంటు లేక పంటలకు నీళ్లు చాలడం లేదని రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోతమంటున్నరు. నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చి మేం మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నం గప్పాలు చెప్పిండు. కావాలంటే మీరు వచ్చి సూడుండ్రి బస్సులు పెడతం అన్నడు. దిక్కుమాలినోడా మేం 24 గంటల కరెంటు ఇస్తుంటే మీ 5 గంటల కరెంటు సూడనీకి మేమెందుకు రావాలె అన్నం’ అని తెలిపారు.
‘దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు లేదు. తెలంగాణలో కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు లెస్స మాట్లాడుతున్నరు. రైతుబంధు పథకం వద్దు అంటున్నరు. ప్రజాధనం వృథా అయితున్నది అంటున్నరు. వాస్తవానికి రైతుబంధుతో రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్‌లు తెచ్చుకునే దుస్థితి తప్పింది. రైతు బీమా పథకం కూడా రైతు కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నది. రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా ఇస్తున్నం. ఆ రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నం. పంట రుణాలు మాఫీ చేశాం. కాంగ్రెస్, బీజేపీ కుయుక్తులవల్ల ఇంకా కొందరికి పంట రుణాలు మాఫీ కాలేదు. ఎన్నికల తర్వాత వాళ్ల రుణాలు కూడా మాఫీ అయితయ్. ఇందులో ఏం ఫికర్ అక్కర్లేదు’ అని సీఎం చెప్పారు.
ఒక దాని తర్వాత ఒక సమస్యను పరిష్కారం చేసుకుంటూ వచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. జుక్కల్‌లో మంచినీళ్ల బాధలు చూశాం. కానీ ఇవాళ మిషన్ భగీరథతో మంచినీళ్లు ఇస్తున్నాం. ఈ పథకం విజయంవంతం జరగుతోంది. మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. కాబట్టి మంచి చెడ్డలను ఆలోచించి ఓట్లు వేయాలి తప్ప ఆగమాగం వేయొద్దు. షిండే అద్భతుమైన మంచి మనిషి, ప్రేమగా ఉండే మనిషి. తన వద్దకు ఎప్పుడొచ్చినా.. వ్యక్తిగతమైన పని అడగలేదు. మాది వెనుకబడ్డ ప్రాంతం అని ప్రాజెక్టుల, నీళ్లు అడిగారు అని కేసీఆర్ గుర్తు చేశారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అలాగే ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అనే పార్టీలు వస్తాయి.. అనేక మంది నాయకులు అనేక మాటలు చెప్తారు. కానీ ఆలోచన చేసి ఓటు వేయాలి. ఆగమాగం కావొద్దు. సొంత విచక్షణతో ఓటు వేయాలి. ఎవరో చెప్పారు అని ఓటేస్తే పరిస్థితి ఉల్టాపల్టా అవుతుందని పేర్కొన్నారు. బాన్స్ వాడలో పోచారంను గెలిపించాలని ఓటర్లకు విజ్నప్తి చేశారు.