తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని ప్రకటించిన మంత్రుల బృందం నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన చేయనుంది..
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ వంగడం, అన్నారం బ్యారేజ్ లో డిజైన్ లోపాలు, పిల్లర్ కింద బుంగ ఏర్పడడం వంటి అంశాల పైన వారు నేడు నేరుగా పరిశీలన చేయనున్నారు.
అనంతరం మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, ప్రస్తుతం అవుతున్న ఖర్చు, దీనివల్ల సాగునీరు అందుతున్న ఆయకట్టు వివరాలు అన్నింటిని చెప్పనున్నారు