హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్‌పై నింద వేద్దామనే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు..
ఛత్తీస్‌గఢ్ నుంచి కేసీఆర్ ఒక్కరే విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాసుకోలేదని, అప్పటి ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కూడా సంతకం చేశారన్నారు.తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని చెప్పారు. జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్‌కు తన వాదనను మెయిల్ రూపంలో పంపించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రెండు ప్రభుత్వాల మధ్య లంచాలకు ఎక్కడైనా ఆస్కారం ఉంటుందా అని ప్రశ్నించారు. విచారణ కమిషన్ మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపాను. ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 2017 నాటికి 17 పవర్ ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయింది. అన్నీ అనుకూలంగా వున్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాం. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రతి పవర్ ప్లాంట్ 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సింగరేణి బొగ్గు ఉండటం వల్ల విదేశీ బొగ్గుకు మేం ఒప్పుకోలేదు’అని చెప్పారు.