హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఒక వైపు ఎండలు.. మరో వైపు కరెంట్ కోతలతో రైతులు కూనారిల్లుతున్నారు. నెల రోజుల్లో పంటలు చేతికందుతాయనుకుంటున్న తరణంలో విద్యుత్ కోతలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తుండటం వల్ల రైతులు పంటలను బాగానే వేశారు. అధికారికంగా విద్యుత్ కోతలు లేనప్పటికి.. అనధికారికంగానే రోజుకు ఐదారు గంటల వరకు పవర్ కట్ అవుతుందని రైతులు చెబుతున్నారు. కొన్ని సర్కిళ్లలో 9 గంటల వరకు కరెంట్ కోత అమలవుతోంది. అయితే ఒక్కో జిల్లాలో ఒక్కో టైమింగ్‌ను నిర్ణయించి.. ఆ సమయంలో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నారు. పవర్ కట్ విషయంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులకు అధికారికంగా కాకుండా.. మౌఖికంగానే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పంట చేతికొచ్చే సమయంలో కరెంట్ కోతల వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితన జిల్లాల రైతులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లాలో రాత్రి పది గంటల తర్వాత విద్యుత్ సరఫరా లేకపోవడంలో అయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు ఆందోళన పడుతున్నారు.
ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి.. చివరి తడులకు నానా ఇబ్బందులు పడుతున్న రైతులను కరెంట్ కోతలు మరింతగా భయపెడుతున్నాయి. చెరువు నీటితోనైనా పంటలు కాపాడుకోవాలని అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదని అన్న దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా వ్యవసాయానికి రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారని అక్కడి రైతులు చెబుతున్నారు. ఉత్పత్తి తగ్గడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే పగటిపూట మాత్రమే సరఫరా చేస్తున్నామని సంబంధిత అధికారులు సమాధానమిస్తున్నారు. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు జనరేటర్ల సాయంతో మోటార్లు నడుపుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని పలు మండలాల్లోని వివిధ గ్రామాల్లో పంటలు ఎండిపోగా పశువులను మేపుతున్నారు. సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాలోనూ కోతలు విధిస్తున్నారు.
రికార్డు స్ధాయిలో పెరిగిన పవర్ డిమాండ్..
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 14 వేల మెగావాట్ల మార్కును దాటింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇంత పెద్ద స్థాయిలో కరెంట్‌కు డిమాండ్ రాలేదు. ఈ డిమాండ్ 16 నుంచి 18 వేల మెగావాట్లకు కూడా చేరుకోవచ్చని, అయినా విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. సాంకేతికంగా గ్రిడ్‌ను కూడా ఆ పరిస్థితులకు అనుగుణంగా తీర్చి దిద్దుతున్నట్లుగా ట్రాన్స్‌కో అధికారులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..