హైదరాబాద్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదాపడిది. కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు. ఈ నెల 20న జరగాల్సిన ప్రజాభేరి సభను మరొక రోజు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో పాటు మరి కొందరు నాయకులు ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పాలమూరు ప్రజాభేరి పేరుతో సభ నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది.
అయితే పాలమూరు సభకు ఆహ్వానిస్తూ. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈ నెల మొదటి వారంలోనే పీసీసీ లేఖ రాసింది. కానీ ఇప్పటీ వరకు ప్రియాంగ గాంధీ షెడ్యూల్ ఖరార్ కాకపోవడంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరి కొందరు నాయకుల చేరికలు మరింత ఆలస్యం కానుంది. అయితే ఈ నెల 23 లేదా 28, 30వ తేదీల్లోని ఏదో ఒక రోజు సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం పాలమూరు జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పటికి ప్రియాంక గాంధీ పర్యటన ఖరార్‌కాకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు రావడం ఖాయమని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రియాంక గాంధీ వస్తేనే..
ఖమ్మం సభకు రాహుల్‌గాంధీ వచ్చినట్లుగా.. పాలమూరు ప్రజాభేరి సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వస్తేనే పార్టీకి మరింత లాభం జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టిందని ఆ పార్టీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ప్రియాంక గాంధీనే చూస్తారని కూడా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరగడానికి అవకాశం ఉంటుందని, సభకు కూడా సార్థకత వస్తుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ నేతలున్నారు. పాలమూరు ప్రజాభేరీ సభ విజయవంతానికి టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో.. పలువురు సీనియర్లతో కూడిన ఒక కమిటీని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియమించారు. సభా నిర్వహణతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లిd నియోజక వర్గాల నుంచి జన సమీకరణ చేసేందుకు ఇన్‌చార్జ్‌లను కూడా నియమించారు.
ఇదిలా ఉండగా, కొల్లాపూర్ సభా వేదికగా జరిగే పాలమూరు ప్రజాభేరిలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జడ్పీ చైర్మన్‌తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు నాయకులు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది