హైదరాబాద్ – ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణ ఎదుర్కొంటున్న సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలతో పాటు బీజేపీ చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నాయకులను పేర్కొంటూ నగర వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. వాటిలో అందర్ని ఆకట్టుకుంటున్నది పదితలల రావణాసురుడి ప్రధాని మోడీ ఫ్లెక్సీ.. ఈడీ, సిబిఐ,ఎలక్షన్ కమిషన్,అదాని, ఆదాయపన్ను, డిఆర్ఐ, ఐబి, ఎన్సీబి, ఎన్ ఐ ఎ లను ఒక్కో తలలో చూపారు.. చివరగా ఈ ఫ్లెక్సీకి డెస్ట్రాయిర్ ఆఫ్ డెమోక్రసీ – ఫాదర్ ఆఫ్ హీపొక్రసీ అని పేరు పెట్టారు..
ఇతర పోస్టర్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా , అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ , పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి , ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే ఐటీ, సీబీఐ రైడ్స్‌కు ముందు, తర్వాత రంగు మారినట్లు చూపించారు. తెలంగాణలో కవిత మాత్రం రైడ్స్‌కు ముందు, తర్వాత ఒకేలా ఉన్నారని.. అసలైన రంగులు వెలవంటూ పేర్కొన్నారు. చివర్లో బైబై మోడీ (#Bye Bye Modi) అంటూ హ్యాష్ టాగ్‌తో పోస్టర్లను అంటించారు. ఇప్పుడీ పోస్టర్లను, ఫ్లెక్సీలను నగర ప్రజలు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.