హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరోనా మొదటి, సెకండ్ వేవ్‌లో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే… ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడి కోలుకున్న వారిని లాంగ్ కొవిడ్/పోస్టు కొవిడ్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒమిక్రాన్ బారిన పడి కోలుకున్న వారిలో రోగ నిరోధకశక్తి వేగంగా తగ్గిపోతోందని ఇటీవల నిర్వహించిన పలు వైద్య అధ్యయనాలు తేల్చాయి. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వారు భవిష్యత్‌లో పలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలువురు ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నాక… ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మత్తుగా ఉండడం, నీరసం, తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు, మతిమరుపు, శరీరంలో రక్తం గడ్డకట్టడం, పక్షవాతం తదితర ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. మరికొందరిలో క్షయ, ఫంగల్ ఇన్‌ఫె క్షన్లు కూడా దాడి చేస్తున్నాయి. దేశంలో, రాష్ట్రంలో కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో 88శాతం ఇప్పుడు పోస్టు కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారని లంగ్ ఇండియా జర్నల్ అధ్యయనం తేల్చింది.
ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వృద్ధులు, స్థూలకాయంతో ఉన్న వారు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులతోపాటు సాధారణ ఆరోగ్య వంతులు కూడా ఎక్కువగా పోస్టు కొవిడ్ వ్యాధులతో ప్రాణాంతక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోస్టు కొవిడ్‌తో బాధపడుతున్న వారిలో దాదాపు 20శాతం మందికి చికిత్స అందించడం ఇబ్బందిగా మారుతుందంటే ఒమిక్రాన్ అనంతరం దాడి చేసే పోస్టు కొవిడ్ వ్యాధుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పోస్టు కొవిడ్ అనారోగ్యం బహిర్గతమైన వెంటనే కొవిడ్ బాధితులు వెంటనే వైద్యులను సంప్రదించాలని, లేనిపక్షంలో 30శాతం మందిలో పరిస్థితులు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్నాక వచ్చే అనారోగ్యం దానంతట అదే తగ్గిపోతుందని వేచి చూడొద్దని హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.