హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్లను ప్రయాణికులు దాదాపు 99.60 శాతం వినియోగించుకున్నారు. ఇటీవల ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ సీట్ల ధరలను గణనీయంగా తగ్గించడం కూడా ఇందుకు ఒక కారణమని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 50 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో చార్జీలను రైల్వే శాఖ 25 శాతం తగ్గించింది. ఈ తగ్గింపు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లకూ వరిస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో 50 శాతం కంటే తక్కవగా ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. టికెట్ బేసిక్ చార్జీలో గరిష్టంగా 25 శాతం వరకు తగ్గించే అధికారాన్ని జోనల్ రైల్వేలకు రైల్వే శాఖ అప్పగించింది.
రైళ్లలో ఆక్యుపెన్సీని పెంచడానికి చార్జీల హేతుబద్దీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాగా, ముందుగా దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే శాఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రూట్లలో 25 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు దాదాపు అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తున్నాయి. ప్రస్తుతం 50 వందేభారత్ సర్వీసులు ప్రయాణికులకు ప్రతీ రోజూ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు కూడా మరిన్ని వందే భారత్ రైళ్లు రాబోతున్నాయి.
సికింద్రాబాద్-నాగ్‌పూర్, కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-భువనేశ్వర్, సికింద్రాబాద్-పూణ రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా, భారతీయ రైల్వే శాఖ త్వరలో నాన్ ఏసీ వందే భారత్ సాధారణ్ రైళ్లు, వందే స్లీపర్ రైళ్లు, వందే మెట్రో రైళ్లను కూడా ప్రారంభించనుంది. వచ్చే ఏడాది మార్చిలోగా ఈ రైళ్లనన్నింటినీ రైల్వే శాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని రైల్వే శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.