కరీంనగర్ – ప్రభుత్వాన్ని కూల్చుతామంటే..చూస్తూ ఊరుకోవాలా? అని బీజేపీ, బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో జరిగిన వనమహోత్సవం లో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ హితమైన మొక్కల్ని నాటేందుకు కృషి జరుగుతుందన్నారు. నలభై లక్షల మొక్కల్ని కరీంనగర్ లో నాటబోతున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలు కూల్చిందని మండిపడ్డారు.
ఇక బండి సంజయ్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు ? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే..చూస్తూ ఊరుకోవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ధర్మం తప్పలేదు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాజనీతిని అవలంభిస్తున్నామన్నారు.
గత ఏడాది డిసెంబర్ 3 వరకు తమకు ఎమ్మెల్యే లను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. పడగొడతాము, కూలగొడతాం అని రెచ్చగొట్టింది బీజేపీ, బీఆర్ఎస్ నేతలే అన్నారు. బండి సంజయ్ కూడా ప్రభుత్వం కూలిపోతుంది అని అన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని మీరంటే.. నిలబెట్టడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలను ఆహ్వానిస్తున్నామన్నారు. రాజ్యాంగ హత్యా దివస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్వహించడం దారుణమన్నారు. కేటీఆర్ కి చేరికల మీద మాట్లాడే హక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని మంత్రిని చేసింది వారని తెలిపారు. వారు చేస్తే రాజకీయ పునరేకీకరణ అవుతుంది.. మేము చేర్చుకుంటే రాజ్యాంగ విరుద్దమా? రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుతాన్ని కూల్చుతాము అన్నది కేటీఆర్ కాదా…? అని ప్రశ్నించారు. కాగా కుల గణనపై రెండు రోజలలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి .