Tuesday, November 26, 2024

TS: కేసీఆర్, బండి సంజయ్‌ పై పొన్నం ప్రభాకర్ ఫైర్..

హుస్నాబాద్ : మాజీ సీఎం కేసీఆర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ‌ హుస్నాబాద్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోని బండి సంజయ్‌కి, నాలుగు నెలల పాటు ఉలుకు పలుకు లేకుండా ఇప్పుడు పొలాల బాట పట్టిన కేసిఆర్ ఈరోజు రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ డ్రామాలకు తెరలేపారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్, బండి సంజయ్ ఇద్దరూ కూడా ఇక్కడ దీక్ష చేసే బదులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలోని రైతులకు ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోడీ దగ్గర దీక్ష చేయాలని హితవు పలికారు. విభజన హామీలు అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించిన నరేంద్ర మోడీ దగ్గర ధర్నా చేసి కేంద్రం దగ్గర నిధులు తీసుకురావాలన్నారు.

ఎన్నికల్లో ఓట్ల కోసం మొన్నటి దాకా రాముడు ఫోటో పెట్టుకుని నరేంద్ర మోడీ ఫోటో బంద్ చేశారని ఎద్దేవా చేశారు. ఈ రోజు రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తున్న మీరు కల్లాల దగ్గర రైతులు కన్నీరు పెట్టుకున్నప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగితే సలహాలు ఇవ్వని కేసీఆర్ ఈ రోజు పొలాల బాట పట్టారని మరి నాలుగు నెలలు ఏం చేశారని అన్నారు.

వర్షాలు పడకపోతే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న మీరు రైతులను రాజకీయం కోసమే వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రధానమంత్రి దగ్గర ప్రకృతి వైపరీత్యం సహకారం తీసుకురావడానికి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి మేం సిద్ధంగా ఉన్నాం రండి అని అన్నారు. గత సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు పడలేదు కాబట్టి నీటి ఎద్దడి ఎదురైందని తెలిపారు. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటి పోయాయన్నారు. కాని కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది అంటున్న వ్యక్తులకు కనీస జ్ఞానం కూడా లేకుండా పోయిందని విమర్శించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement