హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రైతులు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగేలా దీవించాలని ప్రకృతిమాతను ప్రార్థించారు.
‘పండిన పంటల రాశులతో ఇండ్లు కళకళలాడుతుంగా, రైతుల జీవితాల్లో సంక్రాంతి శోభ నిండుదనాన్ని సంతరించుకుంటుంది. నూతన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించింది. రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతాంశంగా నాడు అమలు చేసిన కార్యాచరణ పదేండ్ల అనతికాలంలోనే సత్ఫలితాలు ఇచ్చింది. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలు పటిష్ఠంగా అమలు చేశాం. తద్వారా సాధించిన వ్యవసాయ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశంసలు అందుకుంది. దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం.
కుల వృత్తులకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభను నింపింది. పదేండ్ల బీఆర్‌ఎస్ సర్కార్ వ్యవసాయరంగ అభివృద్ధి కోసం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రైతుల జీవితాల్లో వెలుగు నింపాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్లాం. ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న తెలంగాణ వ్యవసాయం బీఆర్‌ఎస్ హయాంలో పండుగలా మారింది. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి.’ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.