న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనకుండా రాజకీయాలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పండించిన చివరి గింజ కోనిపించే వరకు రైతుల పక్షాన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఉన్నపళంగా మనసు మార్చుకొని వడ్లు కొంటామన్నా అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. కేసీఆర్ ముందు చూపు లేకుండా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి ఇచ్చిన లేఖ ఇప్పుడు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు. ఈ లేఖను సాకుగా చూపిస్తూ బాయిల్డ్ రైస్ తీసుకునే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టంగా చెబుతోందని, ఢిల్లీ వచ్చే మంత్రులకు ఇక్కడ ఎవరూ విలువ కూడా ఇవ్వడంలేదని ఎద్దేవా చేశారు.
ఎంపీలేమో సెంట్రల్ హాల్లో ఫొటోలకు పోజులిస్తూ పోరాడుతున్నామని నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంత తీవ్రమైన అంశం మీద మాట్లాడానికి వచ్చే బృందంలో కేటీఆర్, కవిత, హరీష్‌రావు ఎందుకుండడడం లేదని రేవంత్ ప్రశ్నించారు. తాను బతికుండగా రైతులకు కష్టం వచ్చే ప్రసక్తే లేదని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేసీఆర్ రైతులు ఇంత కష్టాల్లో ఉంటే ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ప్రధానితో మాట్లాడి సమస్యను పరిష్కరించే అవకాశమున్నా కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టేందుకు, రైతుల జీవితాలను ఫణంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రైతుల పట్ల కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, జంతర్ మంతర్‌లో ఆమరణ దీక్ష చేయాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తుందని రేవంత్ చెప్పుకొచ్చారు.
అందరినీ వరి పండించొద్దని చెప్పిన కేసీఆర్ తన ఫామ్ హౌజ్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారని, కేసీఆర్ వద్ద ధాన్యం కొనే వాళ్లు పేద రైతుల వడ్లు కొనరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కాంగ్రెస్‌కు 10 వేల కోట్లిస్తే కనీస మద్దతు ధరకు తెలంగాణలో ప్రతి గింజా కొని చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. ఈ సీజన్లో వచ్చే ధాన్యంలో రా రైస్ పోగా మిగిలిన నూకలను టన్నుకు రూ. 2 వేలకు అమ్ముకున్నా వెయ్యి కోట్లు మాత్రమే నష్టం వస్తుందని, రూ. 2.5 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వెయ్యి కోట్లు భరించలేరా నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేయలేని పక్షంలో వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించడం, రైతు బంధు పథాకలెందుకు, ఏం పంటనూ కొనుగోలు చేయని ప్రభుత్వమెందుకని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ చరిత్ర, దేశ చరిత్రపై ఎలాంటి అవగహన లేదని ఆయన విమర్శించారు. డ్రామారావు పుట్టింది ఆంధ్రాలో, చదివింది విదేశాల్లో అని, ఆయనకు చాలా విషయాలు తెలియదని ఎద్దేవా చేశారు. రైతుల కోసం కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చిందీ తామేనని, రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టింది, ఒకే సంతకంతో దేశంలోని రైతులు 70 వేల కోట్ల రూపాయలను మాఫీ చేసింది, సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు రుణ మాఫీతో లబ్ధి జరగలేదని గ్రహించి, 36 లక్షల మంది రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున రూ. 1,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టులు, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, సీలింగ్ యాక్ట్, పంటలకు మద్దతు ధర, భూముల సీలింగ్ యాక్ట్, మార్కెట్ వ్యవస్థ వంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 7 వేల మంది రైతులను పొట్టనబెట్టుకుందని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చి రకరకాల పేర్లతో దోపిడీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.