నిజామాబాద్, ప్రభన్యూస్ : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రాజకీయ దుమారం తారాస్థాయికి చేరింది. వచ్చే యాసంగిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పేచీలు పెడుతుందని టీఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనేలా చేస్తామని టీఆర్‌ఎస్ నేత చెబుతూనే ఈ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటూ రైతులను కోరుతుంది. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు బృందాలుగా ఏర్పడి యాసంగిలో సోయా, మొక్కజొన్న, పత్తితో పాటు మినుము, కందిలాంటి పంటలు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏడు లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగు అవుతాయి. ఇందులో 4.20 లక్షల ఎకరాల్లో వరి పంట వేసారు. గత ఏడాది యాసంగిలో జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దాదాపు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం 430 కొనుగోలు కేంద్రాలు పెట్టె కొనుగోలు చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం అమ్ముకున్నారు. నిర్ణీత కాల వ్యవధిలోనే సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయిపోయింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో వరి, మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండడంతో రైతులు పంట అమ్మకం సులువై తూకం, తరుగు వంటి దోపిడిలు యథేచ్చగా సాగుతున్నా సరే రైతులు రోజుల తరబడిగా పడిగాపులు కాసి మరీ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్ముకుంటున్నారు. ఎఫ్‌సిఐతో ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోంది. స్వల్ప వ్యవధిలోనే ధాన్యం తాలుకు డబ్బును రైతుల ఖాతాలో జమ చేస్తోంది. పంట పొలాలకు సమీపంలోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే విషయంలో పేచీలు పెడుతున్న నేపథ్యంలో వచ్చే యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రతిష్టంభన ఏర్పడింది.
అప్రమత్తం అయిన రాష్ట్ర ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటూ విస్తృత ప్రచారానికి సిద్దం అయింది. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేనందున వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలంటూ సూచిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోనే ప్రతియేటా యాసంగిలో కనీసం 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నల వరి ధాన్యం దిగుబడి వస్తుంది. అందుకే ఈ యాసంగి కానీ ఒక సీజన్‌లో 3.20 లక్షల ఎకరాల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించడం ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. వరి వేయొద్దని అధికారులు చెబుతుంటే ఎహే! వరే వేయండి ప్రభుత్వం ఎలా కొనదో చూస్తాం అంటూ బీజేపీ నేతలు రెచ్చగొడుతుండడంపై టీఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily