భద్రాచలం టౌన్, (ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొలిటికల్ వార్ నడుస్తోంది. భద్రాచలంలో రాజకీయంగా ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు పరస్పరం కేసులు పెట్టుకుని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. దీంతో చిటపట చినుకులతో చల్లగా ఉన్న వాతావరణంలో రాజకీయం వేడి పుట్టిస్తోంది.
భద్రాచలంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితులు మారాయి. నిన్నటికి నిన్న (సోమవారం) ఎమ్మెల్యే పోదెం వీరయ్య సీఎం కేసీఆర్ పై కేసు పెట్టారు. తమను సీఎం కేసీఆర్ మోసం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా దీనికి ప్రతిగా ఇవ్వాల (మంగళవారం) బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేగా పోదెం వీరయ్య ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని , భద్రాచలం ప్రజలను మోసం చేశాడని రివర్స్‌లో కేసు పెట్టారు. పరస్పరం రెండు పార్టీల నేతలు పెట్టిన కేసులతో పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే..