Saturday, November 23, 2024

Political Tension – బిఆర్ఎస్ తొలి జాబితాకు కౌంట్ డౌన్….ఏ క్ష‌ణంలోనైనా విడుద‌ల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఎప్పు డెప్పుడా అని ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అసెంబ్లి ఎన్నికల బరిలో నిలిపే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ను భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉదయం ప్రకటించేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం ఊపందుకుంది. నేడు శ్రావణ సోమవారం.. అందునా దశమి కావడంతో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసేందుకు కేసీఆర్‌ ముహూర్తం నిర్ణయించినట్టు- భారాస కీలక నేతలు చెబుతున్నారు. ఉదయం 11:05 గంటల నుంచి 12 గంటల లోపు ఏ క్షణాన్నైనా ఇక్కడి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు- చేసి పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో 96 లేదా 105 మంది అభ్యర్థులకు చోటు- దక్కనున్నట్టు- సమాచారం. పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలున్నట్టు- భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి సిద్ధమై వివిధ కారణాల వల్ల టికెట్‌ను నిరాకరించే నేతలకు భవిష్యత్తులో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్‌ చైర్మన్లుగా అవకాశం ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్‌ నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించి హామీ ఇచ్చినట్టు- ప్రచారం జరుగుతోంది.

ఈ పదవులను కట్టబెట్టేందుకు అవకాశం లేని నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇస్తామని కూడా భరోసా ఇచ్చారని చెబుతున్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని భారాస మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేయలేదని కీలకంగా వ్యవహరించేది మనమేనంటూ కేసీఆర్‌ ఆశావహులకు చెప్పి వారిలో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసినట్టు- తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో బోలెడు పదవులు వస్తాయని, అప్పుడు అందరినీ అందలమెక్కిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు- సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేకపోతున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహులతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీ- రామారావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పిలిపించి వారిని బుజ్జగించారని, ఆ తర్వాతే కేసీఆర్‌ తొలి జాబితాలో ప్రకటించే అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్‌ మొదట ప్రకటించనున్న జాబితాలో దాదాపు 85 శాతం మంది పాత (సిట్టింగు) వారికే మళ్ళీ పోటీ- చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.

10 నుంచి 15 మంది సిట్టింగ్‌లకు అనుమానమే
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న భారాస తొలి లేదా మలి జాబితాలో దాదాపు 10 నుంచి 15 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈ దఫా పోటీ- చేసే అవకాశం ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఈ జాబితాలో ఇరువురు మహిళా గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నట్టు- సమాచారం. ఓ మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేను తప్పించి ఆ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రిని బరిలో ఉంచనున్నట్టు- సమాచారం. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలోని గిరిజన రిజర్వుడ్‌ నియోజక వర్గం నుంచి పోటీ- చేసి అక్కడి భాజపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన నాయకుడిని గిరిజన అసెంబ్లీ నుంచి పోటీ-కి పెట్టాలని ప్రతిపాదించినట్టు- సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి భారాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు- ఇవ్వడం అనుమానమేనన్న ప్రచారం జరుగుతోంది.

సిట్టింగులకు టికెట్లను నిరాకరించే జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి ముగ్గురు ఉండవచ్చని చెబుతున్నారు. కరీంనగర్‌ నుంచి ఒకరిద్దరు, వరంగల్‌ నుంచి ముగ్గురు లేదా నలుగురు, ఖమ్మం నుంచి ఇద్దరు, నల్గొండ నుంచి ఇద్దరు, మహబూబ్‌నగర్‌ నుంచి ఇద్దరు, మెదక్‌ నుంచి ఇద్దరు, రంగారెడ్డి నుంచి ఇద్దరు, హైదరాబాద్‌ నుంచి ఒకరు ఉండే అవకాశం ఉంది. మెదక్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కొత్త ప్రభాకర్‌ రెడ్డిని దుబ్బాక అసెంబ్లీకి ఎంపిక చేయనున్నట్టు- సమాచారం. ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలు అసెంబ్లీ బరిలో ఉండనున్నట్టు- చెబుతున్నారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారంతా తిరిగి పోటీ- చేస్తున్నట్టు- తెలుస్తోంది.

- Advertisement -

ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రి వర్గంలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న మహమూద్‌ అలీని నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ-కి పెట్టాలని భావించినా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు- చెబుతున్నారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఎక్కడ సర్దుబాటు- చేయాలో తెలియక పెండింగ్‌లో పెట్టారని చెబుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ అసెంబ్లీ సెగ్మెంటు- నుంచి ఆమెను పోటీ- చేయించాలని అనుకున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సర్వేల్లో స్థానిక ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు మంచి ఫలితాలు రావడంతో ఆయనను తప్పించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు- సమాచారం. అయితే సత్యవతిని ములుగు అసెంబ్లీ నుంచి పోటీకి పెడితే ఎలా ఉంటు-ందన్న ప్రతిపాదనపై కేసీఆర్‌ సమాలోచనలు జరుపుతున్నట్టు- చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement