హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారాస అధినేత సీఎం కేసీఆర్ సైలెంట్‌గా ఆపరేషన్ కొనసాగిస్తు న్నారు. మొదట దక్షిణ తెలంగాణపై దృష్టిని సారించారు. పార్టీకి, సిట్టింగ్‌లకు ఇబ్బం దులు తెస్తున్న వర్గాలపై ఫోకస్ పెట్టారు. వారి వారి అసెంబ్లిd స్థానాల్లో ఉన్న పార్టీ సమస్యలపై వివరాలను తెప్పించుకు న్నారు. స్వయంగా కొందరితో సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు సమాచారం. మరికొందరు ఎమ్మెల్యేలతో మీ గెలుపునకు అడ్డంకిగా ఉన్న వివరాలను త్వరలో అందిం చాలని స్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలకు ట్రబుల్ షూటర్‌ను పంపిస్తున్నాను అని చెప్పినట్లు విశ్వ సనీయ వర్గాలు వెల్లడించాయి. నెల రోజుల లోపే స్థానికంగా పార్టీ క్యాడర్, నేతలు ఒక్క దారిలో కలిసి పని చేసేలా చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని పలువురు ఎమ్మెల్యేలతో స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారని, మరికొందరిని పిలిపించుకొని తీవ్రంగా మందలించినట్లు గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లోని నేతలను సైతం సీఎం కేసీఆర్ దారిలోకి తెచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధినేత ఆదేశాలతో పార్టీ గెలుపునకు పని చేస్తామని స్పష్టం చేసిన నేతలు ఆ దిశగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు.
అంతా చక్కబడింది.. ఓరుగల్లు గులాబీదే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ ప్రధాన ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ క్లాస్ పీకినట్లు సమాచారం. మంచి పేరు ఉండటమే కాదు.. ప్రజల మద్దతు ఉండాలని గట్టిగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఇదే జిల్లాకు చెందిన మరో నేత 1989 నుంచి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సారి అక్కడ గెలుపు ఓ మాజీ ఎమ్మెల్యే ద్వారా కొంచెం ఇబ్బందులు తలెత్తుతుండటంతో అతనికి లైన్ క్లియర్ చేశారు. అసంతృప్త నేతకు ట్రస్ట్ ఛైర్మన్‌గా బాధ్యతలను అప్పగించడంతో ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు సమసిపోయాయి. మరో రెండు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉండటంతో వారిని దారిలోకి తెచ్చారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ భారాస ముందుకు వెళ్తోంది.
నల్గొండలో సమస్యలు క్లియర్
ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ పలువురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. కొంత మంది నేతలతో సైతం చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే ఆధ్యాత్మికంగా పేరుగాంచిన ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేతోనూ అధినేత మాట్లాడి వివరాలను తెప్పించుకున్నారు. వెంటనే అక్కడి స్థానిక నేతతో మాట్లాడడం, పార్టీలైన్‌లో గెలుపునకు కృషి చేసేలా నిర్ణయించడం జరిగింది. అక్కడ సమస్యలు సమసిపోయాయి. ఆ ఎమ్మెల్యే గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. ఇక ఆంధ్రా గుమ్మంగా పిలుచుకునే ఆ సెగ్మెంట్ ఎమ్మెల్యేతోనూ అధినేత వివరాలను తెప్పించుకున్నారు. గత కొద్ది రోజులుగా అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆ ఎమ్మెల్యే విజ్ఞప్తిని పరిశీలించిన గులాబీ బాస్ అక్కడి మాజీ ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సందర్భంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న ఆ నేత తన మనోగతాన్ని, పార్టీ పరిస్థితులను వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భవిష్యత్‌లో మంచి అవకాశం వస్తుందని, పార్టీ గెలుపు కృషి చేయాలని అధినేత చెప్పడంతో అతను దారిలోకి వచ్చాడు. సిట్టింగ్‌తో కలిసి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తానంటూ వెల్లడించారని సమాచారం.
కలిసి పని చేస్తాం సార్..
ఉమ్మడి రంగారెడ్డిలో కాంగ్రెస్ నుంచి గెలిచి భారాసలో చేరిన ఆ ఎమ్మెల్యేకు సైతం అధినేత కేసీఆర్ లైన్ క్లియర్ చేశారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని ఆ సంతృప్త నేత సంప్రదింపులు చేశారని జోరుగా ప్రచారం సాగింది. ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్న మాజీ ఎమ్మెల్యేతో గులాబీ బాస్ మాట్లాడటంతో దారిలోకి వచ్చారు. టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపుకు కృషి చేస్తానంటూ అధినేతకు తెలిపినట్లు సమాచారం. అక్కడ కూడా గెలుపు నల్లేరు మీద నడకగా మారినట్లు అయ్యిందని గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి. అటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఓ ప్రధాన సెగ్మెంట్‌లోనూ సమస్యలపై అధినేత ఆరా తీశారు. ముఖ్యంగా అక్కడి నుంచి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాజీ మంత్రి బరిలోకి దిగబోతున్నారు. ఇక్కడ భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే బలంగా ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని అధినేత దృష్టికి రావడంతో ఆరా తీశారు. ఆ ఎమ్మెల్యేతో నియోజకవర్గంలోని సమస్యలను వారంలోగా తెలపాలని అధినేత చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఏ సమస్య నైనా చూసుకుంటారని ఆ నేతకు చెప్పినట్లు తెలుస్తోంది.
ట్రబుల్ షూటర్ డైరెక్షన్
దక్షిణ తెలంగాణపై భారాస అధినేత కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలుపును సీరియస్‌గా తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలు పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇబ్బందులు ఉన్న స్థానాల బాధ్యతలను ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలో కాంగ్రెస్ బలం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్న గులాబీ బాస్.. మొదట్లోనే తుంచే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ నడిపించిన సైలెంట్ ఆపరేషన్‌ను ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నారు. ఇక ఆ జిల్లాలు గులాబీకి కంచుకోటగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారాస నేతలు భావిస్తున్నారు.