Tuesday, November 26, 2024

Political History of Karimnagar – “ఉద్య‌మాల గ‌డ్డ – గులాబీ తోట‌”…

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అనేక సభలు, పథకాలు ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఉద్యమానికి అండగా నిలిచిన కరీంనగర్‌ అంటే కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం. సీఎం కేసీఆర్‌ 2004లో కరీంనగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం రెండు పర్యాయాలు ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. 2009 నవంబర్‌ 29న తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష ఇక్కడి నుంచే బయలుదేరి ఉద్యమ దశను మార్చి తెలంగాణ రావడం వరకు పోరాటం చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రగతి నివేదన సభ ద్వారా ప్రజలకు ప్రగతిపై నివేదించిన సీఎం 2018 డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్‌ జిల్లాలో తిరిగి మెజారిటీ బీఆర్‌ఎస్‌ సాధించింది. 2014లో జగిత్యాల మినహా 12 చోట్ల విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ 2018లో మంథని మినహా అన్ని స్థానాలు కైవసం చేసుకుంది. నవంబర్‌ 30, 2023న జరగనున్న ఎన్నికల్లో మొత్తం 13 సీట్లు స్వీప్‌ చేయా లని చూస్తుంది. గతంలో కాకుండా ఈసారి చాలా ఈసారి చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండబోతుంది.

కోరుట్ల నియోజకవర్గం నుంచి 2014లో కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి జువ్వాడి నర్సింగ రావుపై, 2018లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన నర్సింగరావుపై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో విద్యాసాగర్‌ రావు స్థానంలో ఆయన కుమారుడు డాక్టర్‌ సంజయ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
2014 ఎన్నికల్లో అంతటా గులాబీ గాలి వీసినా జగిత్యాల నుంచి ఇక్కడ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు టీ.జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ ఎం.సంజయ్‌పై 7,828 ఓట్ల మెజారి టీతో గెలుపొందారు. 2018లో సంజయ్‌ జీవన్‌రెడ్డిపై గెలు పొందారు. ఈసారి వారిద్దరు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడు తున్నారు. ఈసారి ఓటరు ఎటువైపు ఉంటారో చూడాలి.

ధర్మపురి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్‌ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌పై 18,679 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో సైతం అడ్లూరి గెలుపు అంచుల వరకు కొప్పుల ఈశ్వర్‌ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో మళ్లిd వీరిద్దరు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.


రామగుండం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసిన సోమారపు సత్యనారాయణ… బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీచేసిన కోరుకంటి చందర్‌పై కేవలం 2295 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018 ఎన్నికలకు వచ్చేసరికి చందర్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌అభ్యర్థిగా పోటీ చేసి సోమారపు సత్యనారాణపై విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో చందర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగగా మక్కాన్‌ సింగ్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి తేలవలసి ఉంది.
మంథని నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు 19,360 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో పుట్ట మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. 2023లో వీరిద్దరే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం, ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి.
పెద్దపల్లి నియోజకర్గం నుంచి 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన దాసరి మనోహర్‌రెడ్డి అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి భానుప్రసాద్‌రావుపై గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌రావు బీఆర్‌ఎస్‌లో చేరడం, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కాంగ్రెస్‌లో చేరడంతో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయ రమణారావుపై దాసరి మనోహర్‌రెడ్డి విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో వీరిద్దరు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రకటించాల్సి ఉంది.
కరీంనగర్‌ నుంచి 2014 ఎన్నికల్లో గంగుల కమలాకర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌పై 24,754 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో పొన్నం కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నా బండి సంజయ్‌ టఫ్‌ ఫైట్‌ ఇచ్చారు. గంగుల నాలుగోసారి గెలుపు కోసం బరిలో దిగారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించాల్సి ఉంది.
చొప్పదండి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన బొడిగ శోభ మాజీ మంత్రి సుద్దాల దేవయ్యపై గెలుపొందారు. పార్టీ నుంచి సస్పెండ్‌ కావడంతో 2018లో బీఆర్‌ఎస్‌ నుంచి సుంకె రవిశంకర్‌ పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యంపై గెలు పొందారు. ఈసారి కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థిని ప్రటించలేదు. మేడిపల్లిలో తిరిగి బరిలో నిలిచే అవకాశం ఉంది.
వేములవాడ నుంచి 2014లో చెన్నమనేని రమేశ్‌ అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన ఆది శ్రీనివాస్‌పై గెలు పొందారు. చెన్నమనేని వారసత్వంపై ఆది శ్రీనివాస్‌ కోర్టులో పోరాటం చేశాడు. శ్రీనివాస్‌ 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి చెన్నమనేని చేతిలో ఓటమిపాలైనారు. ఈసారి చెన్నమనేనికి టికెట్‌ దక్కలేదు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీనర్సింహరావు బరిలో ఉన్నారు. ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీ నుంచి విద్యాసాగర్‌ రావు తన యుడు రాబోతుండటంతో ఈసారి త్రిముఖ పోటీ తప్పదు.
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ 2014 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి కొండూరి రవీందర్‌ రావుపై 53,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొండూరి రవీందర్‌రావు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి తేలవలసి ఉంది.
మానకొండూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి 2014లో రసమయి బాలకిషన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌పై గెలుపొందారు. 2018లో తిరిగి అరెపల్లిపైనే గెలుపొందారు. ఈసారి కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మోహన్‌ బీజేపీలో చేరారు. మోహన్‌కు టికెట్‌ వస్తే త్రిముఖ పోటీ ఉంటుంది.

హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌ రెడ్డిపై గెలుపొందారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డిపై విజయం సాధించారు. 2021లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌ పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై గెలుపొందారు. ఈసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డి బరిలో ఉండగా, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు తేలవలసి ఉంది.
హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన ఒడితెల సతీష్‌కుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డిపై గెలుపొందారు. 2018లో సీపీఐ అభ్యర్థి చాడ వెంకటరెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ వార్‌ నడుస్తుంది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డిలు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ తప్పేట్టు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement