పెద్దపల్లి: కోళ్ల పందాలపై పెద్దపల్లి పోలీసులు కొరడా జులుపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బండారి కుంటలో కోళ్ల పందాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారని పెద్దపల్లి సిఐ ప్రదీప్కుమార్ పేర్కొన్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న వారితోపాటు 11 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకోగా మరికొంతమంది పరారయ్యారన్నారు. 10 పందెం కోళ్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు పందెంరాయుళ్ల నుండి 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
నిర్వాహకులు, కోళ్ల పందాలు ఆడుతున్న ఫజియొద్దిన్, బట్టల రాజు, మన్నం పవన్ కుమార్, మాధవరపు శివయ్య, రాగిని గోపాల్, మహమ్మద్ గౌస్, మహమ్మద్ షఫీ, పిడుగు సదయ్య, సాయి, ఎస్.కె జుబేర్, మహమ్మద్ యూనిస్ లను తీసుకున్నామన్నారు. ఎవరైనా కోళ్ల పందాలు నిర్వహించినా, ఆడిన చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని సిఐ తెలిపారు.