వనపర్తి జిల్లా ప్రతినిధి జూలై 18 (ప్రభ న్యూస్); నేరాల నిర్మూలన శాంతి భద్రతల పరిరక్షణకై కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి , 6 మంది ఎస్ఐలతో కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిదిలోని కోట్ల ఆంజనేయస్వామి స్వామి టెంపుల్ ఏరియా, ఎస్సీ కాలనీలో తెల్లవారుజాము ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలో సరైన పత్రాలు లేని 65 మోటార్ సైకిల్ ఒక ఆటోను సీజ్ చేసి కొత్తకోట పోలీస్ స్టేషన్ కు తరలించారు. సరైన పత్రాలు చూపెట్టి వాహనాలు స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
అదేవిదంగా కాలనీవాసులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సిఈఐఆర్ (దొంగతనం ఫోన్ల రికవరీ) మొదలైన వాటి గురించి అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి డిఎస్పి ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, భద్రత భావం, కల్పించడం గురించి , ఎవరైనా కొత్త వ్యక్తులు , నేరస్తులు వచ్చి ఆశ్రయం తీసుకుంటున్నారా అనే విషయలు తెలుసుకున్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని..వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అన్నారు.
ప్రజాల శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తకోట సిఐ శ్రీనివాస్ రెడ్డి, కొత్తకోట ఎస్సై మంజునాథ్ రెడ్డి, పెబ్బేరు ఎస్సై జగదీష్, పెద్దమందడి ఎస్ఐ హరిప్రసాద్, మదనాపూర్ ఎస్సై మురళి, ఘనపూర్ ఎస్సై శ్రీహరి, కొత్తకోట ట్రాఫిక్ ఎస్ఐ హరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.