మంగపేట, నవంబర్ 24 (ప్రభ న్యూస్) : అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం, మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికల సమాచారంతో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు ఫెర్రీ పాయింట్ల (నావ రేవుల) వద్ద పోలీసులు ఇవాళ ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ ఆధ్వర్యంలో మండలంలోని కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్, మంగపేట పుష్కర్ ఘాట్, మల్లూరు, చుంచుపల్లి, రాజుపేట, అకినేపల్లి మల్లారం తదితర గోదావరి పరివాహక ప్రాంతాలు, ఫెర్రీ పాయింట్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు యాక్షన్ టీంకు చెందిన ఎలాంటి సమాచారమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని రేవుల వద్ద నావల (పడవల) నిర్వాహకులకు, గోదావరి నదిలో చేపలు పట్టే జాలర్లకు పోలీసులు సూచించారు.
మావోయిస్ట్ సభ్యులు మహేష్, కరుణాకర్, మహేందర్, సునీల్, కిషోర్ లతో కూడిన యాక్షన్ టీం వెంకటాపురం (నూగూరు) మండలంలోని కర్రెగుట్టలు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పోలీసులకు పక్కా ముందస్తు సమాచారం ఉండడం, డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలను విజయవంతం చేయాలని, గ్రామాల్లో ఇన్ఫార్మర్ వ్యవస్థను ధ్వంసం చేసి, గ్రామ స్థాయి కమిటీలను బలోపేతం చేయాలని, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి శత్రువు తలపెట్టిన కమాండో, డ్రోన్, హెలీకాప్టర్, బాంబు దాడులను పీఎల్జీఏ సాహసోపేతంగా తిప్పికొట్టి పార్టీని, ప్రజలను రక్షించుకుందామని జిల్లాలోని వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలోని పాత్రాపురం గ్రామ శివారుల్లో గురువారం రాత్రి నిషేదిత మావోయిస్టు పార్టీ జెఎండబ్ల్యూపి పేరుతో కరపత్రాలు వెలిశాయి. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల గ్రామాల మీదుగా పడవలు, నావలపై గోదావరి నది దాటి మంగపేట అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు వచ్చే అవకాశం ఉండడంతో మంగపేట మండలంలోని పలు గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.