సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిత్యం వేలాది మంది వచ్చే ఆస్పత్రిలో ఇంత ఘోరం జరిగినట్లు వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు ఉమామహేశ్వర్‌తో పాటు మరో కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు బాధితురాళ్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ నెల 4న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు సాయంగా భార్యతో పాటు ఆమె చెల్లెలు కూడా వచ్చారు. అయితే, రోగిని వేరే వార్డుకు మార్చడంతో అది ఎక్కడో తెలియక అక్కాచెల్లెల్లు తికమకపడ్డారు. ఆ సమయంలో ఓపీ సెక్షన్‌లోని కంప్యూటర్ ఆపరేటర్ ఉమామహేశ్వర్ వార్డు చూపిస్తానని వారిని మచ్చిక చేసుకున్నాడు. దాన్ని ఆసరాగా తీసుకున్న ఉమామహేశ్వర్ వారిని ఓ గదిలో బంధించి మత్తుమందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఉమామహేశ్వర్‌తో అతడి స్నేహితులు కూడా తమపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, బాధితులు ముందుగా మహబూబ్‌నగర్ వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. కానీ గాంధీ ఆస్పత్రి పరిధిలోని పీఎస్‌కు వెళ్లాలని సూచించడంతో వారు మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధితురాలిని తీసుకుని ఆమె బంధువులు సోమవారం మధ్యాహ్నం చిలకలగూడ పీఎస్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని ముందుగా భరోసా కేంద్రానికి పంపించి ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత వైద్యపరీక్షలకు పంపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉమామహేశ్వర్‌పై రేప్ కేసు నమోదు చేసి, అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరికొంతమంది రేప్ చేసినట్టు బాధితురాలు చెప్పినందున వారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకూ దళితబంధు వర్తింపు!