ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి.
మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్లను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయం ధీమా వ్యక్తం చేశారు. రైతు బంధువుగా ఉన్న సీఎం కెసిఆర్ ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు టిఆర్ఎస్ కు మెండుగా ఉన్నాయన్నారు. అందరి శ్రేయస్సు కోసం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. దేశంలోని రైతులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ ఆలోచనలు చర్యలు ఉన్నాయని చెప్పారు. రైతులకు న్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సీఎం కేసీఆర్ ఎండగట్టారని చెప్పారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ అండదండతో తాను మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక అవుతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పదవి కాలం జనవరి 4తో ముగిసిపోనుంది.