ప్రధానమంత్రినరేంద్రమోదీ తెలంగాణలో రెండో రోజు పర్యటించనున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచే ఆయన రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానితో పాటు గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు కూడా ఈ సభకు హాజరవుతారు.
కాగా, మంగళవారం ఉదయం నరేంద్రమోదీ.. సికిందరాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.మంగళవారం ఉదయం ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి పటాన్‌చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకుంటారు. అక్కడి నుంచే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్‌గా చేయనున్నారు. రూ.1409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేస్తారు. సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనగూడ వరకు.. రూ.1298 కోట్లతో ఎన్‌హెచ్-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ. 399 కోట్లతో చేపడుతున్న ఎన్‌హెచ్ 765డి మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, రూ. 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పటేల్ గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీలో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో మూడంచెల భద్రత..2 వేల మందితో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యటన ముగించుకుని మోదీ ఒరిస్సాకు వెళతారు.