Tuesday, November 19, 2024

ప్లాస్టిక్‌ బియ్యం కాదు, పోషకాహారం.. పోర్టిఫైడ్ రైస్​పై పొరబడుతున్న జనం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోర్టిఫైడ్‌ బియ్యాన్ని ప్లాస్టిక్‌ బియ్యంగా జనం పొరబడతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. చౌకధరల డిపోల ద్వారా కొద్ది రోజులుగా ఎంపిక చేసిన గ్రామాలకు పొర్టిఫైడ్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. సాధారణ బియ్యాని కంటే కొంచెం వైద్యవిధ్యంగా ఆ బియ్యం ఉడడంతో అవి ప్లాస్టిక్‌ బియ్యమని జనం పొరబడుతున్నారు. ఆ బియ్యంతో ఏకంగా తహసిల్దార్‌, ఆర్డీవోలకు ఫిర్యాదులు చేస్తున్న ఘటనలు ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. సాధారణ రేషన్‌ బియ్యం స్థానంలో పోషక విలువలతో కూడిన పొర్టిఫైడ్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తే దళారులకు అమ్ముకోకుండా తినేందుకు ప్రజలు ముందుకువస్తారని అధికారులు చెబుతున్నారు. బియ్యం ఆవశ్యకత, వాటి రూపు రేఖలు, వాటిలోని పోషకాలపై ప్రజలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడంతో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని సివిల్‌సప్లై శాఖ అధికారులు చెబుతున్నారు.

నిరుపేదలకు పోషకాహారాన్ని అందించాలన్న సదుద్దేశ్యంతో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోషకాలతో కూడిన రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పోర్టిఫైడ్‌ రేషన్‌ బియ్యం మే-నెల నుంచి ఎంపిక చేసిన జిల్లాల్లోని రేషన్‌ షాపుల్లో పంపిణీ చేస్తున్నారు. తొలి విడతగా భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కొమరంభీం ఆసీఫాబాద్‌, ఆదిలాబాద్‌ ఈ నాలుగు జిల్లాల్లో పోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ అవుతోంది. ప్రభుత్వం సరఫరా చేస్తోన్న పోర్టిఫైడ్‌ రేషన్‌ బియ్యంలో ఆరు రకాల పోషకగుణాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మైక్రో న్యూట్రీషియన్‌, ఐరన్‌, పొలిక్‌ యాసిడ్‌, బీ కాంప్లెక్స్‌, విటమిన్‌ 2, విటమిన్‌ ఏ, జింక్‌తోపాటు మరికొన్ని పోషకాలు ఈ బియ్యంలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సాధారణ రేషన్‌ బియ్యంలో కేవలం కార్బో హైడ్రేట్‌లు మాత్రమే ఉంటాయి. తెలంగాణలో ప్రస్తుతం రక్తహీనత సమస్య ఎక్కువగా ఉండడంతో పోర్టిఫైడ్‌ బియ్యంతో ఈ అనారోగ్యానికి చెక్‌ పడుతుందనివైద్య నిపుణులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ఆదీవాసీలు రక్తహీనతతో అధికంగా బాధపడుతున్నందున పోర్టిఫైడ్‌ బియ్యం తో వారి సమస్యకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇటీవల ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో పోర్టిఫైడ్‌ బియ్యాన్ని ప్లాస్టిక్‌ బియ్యంగా జనం పొరబడిన ఘటనలు నమోదయ్యాయి. రేషన్‌ బియ్యంలో కొన్ని బియ్యం గింజల ఆకృతి, పరిమాణం వేరేవిధంగా ఉందని, ప్లాస్టిక్‌ బియ్యం గింజల మాదిరిగా ఉన్నాయని, వాటిని అన్నం వండితే ముద్దగా ఉంటోందని, తిన్నా అరగడం లేదని జనం అంటున్నారు. ఈ నేపథ్యంలో పోర్టిఫైడ్‌ బియ్యం, వాటి ఆకృతి, వాటి ఆవశ్యకతపై జనాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement