వనపర్తి, (ప్రభ న్యూస్ ప్రతినిధి): రైతులు వరి పంటకు బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలిపారు. ఈరోజు గద్వాల పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామం జాతీయ రహదారి 44 పై ఉన్న మినుము, వేరుశెనగ పంటలను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, వ్యవసాయాధికారులతో మాట్లాడుతూ…. రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసుకునే అవగాహన కల్పించాలని అన్నారు.
మినుము పంట రైతు మహేశ్వరరెడ్డి తో మాట్లాడుతూ… మినుము పంట ఎన్ని ఎకరాలు వేశావ్ అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా ఐదెకరాలు మినుము పంట వేసినట్టు రైతు తెలిపాడు. టీ9 రకం మినుము పంట సాగు చేశానని క్వింటాల్ కు 8 నుండి 12 వేల వరకు ఉంటుందని 90 రోజులలో పంట కాపు వస్తుందని రైతు తెలిపాడు. పంట మార్పిడి వల్ల దిగుబడి బాగా వస్తుందా అని ముఖ్యమంత్రి అడిగారు. దాదాపు 25 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు వివరించాడు.
వేరుశనగ పంట సాగు చేసిన రాములుతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. వేరుశెనగ క్వింటాల్ ఎంత ఉందని రైతును ముఖ్యమంత్రి ప్రశ్నించగా ఏడు నుండి ఎనిమిది వేల వరకు వేరుశెనగ మద్దతు ధర ఉందని రైతులు తెలిపాడు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేయడం వల్ల భూసారం కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రి రైతులకు వివరించారు. అలాగే విలియం కొండ దగ్గర రైతులు సాగుచేసిన వేరుశనగ పంటలను ముఖ్యమంత్రి పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే షేక్ యాస్మిన్ భాష, అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్ వన్, డి. వేణు గోపాల్, అధికార్లు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital