Tuesday, November 26, 2024

వడ్ల కొనుగోళ్లకు ప్లాన్-బి.. రెడీ చేయాలన్న సీఎం కేసీఆర్

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: యాసంగి ధాన్యం కొనుగోళ్ళపై కేంద్రం నుండి స్పష్టమైన హామీ కోసం పట్టుబడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్లాన్‌-బి కూడా సిద్ధం చేయమని ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓ వైపు ఢిల్లిలో కేంద్రంపై ఒత్తిడి, హామీ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ప్రాంతాల వారీగా ఏఏ పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయో నివేదికలు రూపొందించి రైతులను ప్రోత్సహించమని సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో రెండు రోజులు ఢిల్లిలోనే ఉండి వీలైతే ప్రధానిని, మరికొందరు కేంద్ర మంత్రులను కలవాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యాసంగిలో వరి వేయవద్దని ముందే అప్పీల్‌ చేసిన ప్రభుత్వం అందుకు తగ్గట్లే ప్రత్యామ్నాయ ప్రణాళికపైన దృష్టి సారించింది.

ఇంతలో బీజేపీ నేతలు.. ధాన్యం ఎందుకు కొనరు? మీరు ధాన్యం వేయండి.. ఎందుకు కొనరో చూస్తాం అని ప్రకటించడంతో కేసీఆర్‌ గేర్‌ మార్చారు. యాసంగి కొనుగోళ్ళకు సంబంధించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో మహాధర్నాకు పూనుకున్నారు. ఆ తర్వాత ఢిల్లి వెళ్ళారు. ఢిల్లి నుండి రాగానే.. వరి వేయాలా? ప్రత్యామ్నాయ పంటలు వేయాలా? అన్న అంశాన్ని ప్రకటిస్తానని చెప్పారు.

సీఎం తాజాగా యాసంగి కొనుగోళ్ళ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో వ్యవసాయ అధికారులు ప్లాన్‌-ఎ, ప్లాన్‌-బిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొనుగోళ్ళకు అంగీకరిస్తే మీకు నచ్చిన పంట వేసుకోవాలని, కేంద్రం నుండి స్పష్టత లేకుంటే.. ప్రత్యామ్నాయ పంటలు ఏవేవి వేసుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. యాసంగి ప్రణాళిక చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పప్పు, తృణ ధాన్యాల పంటలతో పాటు, నూనె గింజల పంటలను సాగుచేయాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement