హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో కొత్త కష్టం వచ్చింది. ఇప్పటి వరకు నాయకుల మధ్య అంతర్గత విభేదాలతో సతమతం అవుతుండగా.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) రూపంలో హస్తం పార్టీ నాయకులకు మరో కష్టం వచ్చి పడింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తాయనే జరుగుతున్న చర్చ హస్తం పార్టీ నేతలకు నిద్రపట్టకుండా చేస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌పై ఒక వైపు పోరాటం చేస్తుంటే.. మరో వైపు ఇలాంటి ప్రచారం పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. పొత్తులపై మే 6న వరంగల్‌లో జరిగే ‘రైతు సంఘర్షణ సభ’లో రాహుల్‌గాంధీతో క్లారిటి ఇప్పించాలని ప్రయత్నంలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఢిల్లిdలో జరిగిన సీనియర్ల సమావేశంలోనూ తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికల్లో వెళ్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. అయినా హస్తం పార్టీ నాయకుల్లో నెలకొన్న భయం మాత్రం పోవడం లేదు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం పీకే పని చేస్తారని సీఎం కేసీఆర్ గతంలో బాహాటంగానే చెప్పిన విషయం తెలిసిందే. మరో వైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కోసం పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు కూడా నడుస్తున్నాయి. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో కూడా ఇప్పటికే మూడుసార్లు భేటీ అయ్యారు. పీకేను కాంగ్రెస్‌లోకి తీసుకుని కీలక పదవీ అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌తో జత కడతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శరద్‌పవార్, స్టాలిన్, హేమంత్ సొరేన్ తదితరులు కాంగ్రెస్‌తోనే నడుస్తున్నారు. మమతాబెనర్జీ, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా హస్తంతో జతకట్టించాలనే ప్రయత్నంలో పీకే ఆలోచన చేస్తున్నట్లుగా, ఆ విధంగా కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రతిపాదనలు పెట్టారని చర్చ జరుగుతోంది.
ఇప్పటీ వరకు బాగానే ఉన్నా.. అందులో ప్రధానంగా టీఆర్‌ఎస్ పేరు కూడా వినిపిస్తుండటంతో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం ఆందోళన కలుగుతోంది. రాష్ట్రంలో గత ఏడేళ్లుగా టీఆర్‌ఎస్‌తో ఫైట్ చేస్తున్న కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లో కారుతో దోస్తానా చేస్తే హస్తం పార్టీ నిండా మునగడం ఖాయమనే భయం పట్టుకున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కొందరు నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అన్యాయాలను వెలికి తీస్తామని, కాంగ్రెస్ కేడర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని వదిలిపెట్టే ప్రస్తకే లేదని ఘాటుగానే హెచ్చరికలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, ఇలాంటి సమయంలో అధికార టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనే భయం పట్టుకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలయికను మరొక వర్గం సానుకూలంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా బీజేపీని నిలువరించాలంటే వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో జతకట్టి కేంద్రంలో అధికారంలోకి రావాల్సి ఉంటుందని, ఒకవేళ రాష్ట్రంలో కూడా పొత్తులు అవసరం అనుకుంటే.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ సవారిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు బలంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పీకే భేటీ అయిన సమయంలో రేవంత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు తీవ్రంగానే స్పందించారు. టీఆర్‌ఎస్‌కు పీకీ ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి 40లక్షల మంది ఏకే 47లు ఉన్నారని స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముందస్తు సమాచారం లేకుండానే సునీల్ కనుగోలు (ఎస్‌కే)ను ఢిల్లిd పెద్దలు పంపించారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేలా ఎస్‌కేతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా ఎస్‌కే అనుచరులు పాల్గొని నాయకులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ను నమోదు చేసుకున్నట్లుగా తెలిసింది. ఎస్‌కే టీమ్ అసెంబ్లిd ఎన్నికల కోసం పని చేస్తుందని, పీకే టీమ్ మాత్రం 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై దృష్టి పెడుతారనే చర్చ జరుగుతోంది. అసెంబ్లిd ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ తలపడుతుందని చెబుతున్నారు.
వరంగల్ సభపై నేడు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం
వరంగల్‌లో మే 6న నిర్వహించచబోయే రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేసేందుకు శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీసీసీ కార్యవర్గం, పీఏసీ, డీసీసీ, పార్టీ అనుబంధ సంఘాలు, అసెంబ్లిd, పార్లమెంట్ నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు, గత ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు.