న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో వడ్ల కొనుగోలుపై స్పష్టత కోసం పార్లమెంట్లో ప్రకటన చేయాలని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేశారు. ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, సురేష్ రెడ్డి తదితరులు గురువారం మీడియాతో మాట్లాడారు. తమ రాష్ర్ట ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఖరీఫ్, రబీలోని పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఎంపీ బడుగుల లింగయ్య చెప్పారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చామని, అందుకే దిగుబడి పెరిగిందని అన్నారు. తెలంగాణలో 60 లక్షల ఎకరాల్లో సాగు నడుస్తోందని, సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అవసరముందని అన్నారు. ఎప్పటిలాగానే ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వానకాలం ఎంత కొంటారో టార్గెట్ చెప్తే అదే రైతులకు చెప్తామన్నారు. మామూలు బియ్యం ఎంత, ఉప్పుడు బియ్యం ఎంత కొంటారో చెప్పాలని అన్నారు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొనను అంటోంది కాబట్టి తాము కూడా కల్లాల వద్ద కొనే పరిస్థితి ఉండదని ఎంపీ లింగయ్య స్పష్టం చేశారు.
కేంద్రానికి స్పష్టత లేక రైతులకు కష్టాలు : సురేష్ రెడ్డి
తమ రాష్ట్ర ప్రజలు బాధ పడుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని ఎంపీ సురేష్ రెడ్డి ఆరోపించారు. ఖరీఫ్, రబీలో పంటల ఖరీదుపై స్పష్టత లేని వైఖరితో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. యాసంగి పంట కొంటారా కొనరా..? కొంటే ఎంత కొంటారు..? కొనకుంటే కొనమని చెప్పండన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయోల్ ఒక ప్రకటన చేస్తారు… రాష్ర్టంలో కిషన్ రెడ్డి ఒకటి చెప్తారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం చేసే ప్రకటనను రాష్ర్ట ప్రభుత్వం రైతుల స్థాయికి తీసుకెళ్లి అమలు చేస్తుందన్నారు. తమ డిమాండ్‌ను అంగీకరించలేదు కాబట్టే వాకౌట్ చేశామని ఆయన తేల్చి చెప్పారు.
ఇది గెలుపోటముల సమస్య కాదు-అన్నదాతల సమస్య : కేకే
సభలో వెల్ లోపలకు వెళ్లడం తమకూ బాధాకరమే అయినా రైతుల సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నామని రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు వివరించారు. 1.2 కోటి టన్నుల దిగుబడి ఉండగా, అందులో కనీసం ఒక కోటి టన్నులైనా తీసుకోండని కోరుతున్నామన్నారు. కిషన్ రెడ్డితో మాట్లాడగా… ఆయనకు విషయం అర్థమైందని కేకే తెలిపారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని… యాసంగిలో వచ్చేది ఏదైతే అది తీసుకోమని కోరుతున్నామన్నారు. కొనుగోళ్లకు ఒక్కసారిగా ఫుల్స్టాప్ పెట్టకుండా కొంత సమయం ఇవ్వమని కేకే కోరారు. యాసంగిలో సేకరణపై స్పష్టత ఇస్తే రైతులు అందుకు తగ్గట్టు పంట సాగు చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఒడిశా రాష్ట్రం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోందని చెప్పారు. హుజురాబాద్‌లో ఓడినందుకే ఇలా ఆందోళన చేస్తున్నామని కొందరంటున్నారని, తాము వంద సీట్లలో గెలిచామని, వాళ్లకు 85 సీట్లలో డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ సమస్య గెలుపోటముల గురించి కాదు. రైతుల గురించని కేకే స్పష్టం చేశారు. ఆందోళనలో భాగంగా 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను కూడా వ్యతిరేకిస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశామని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital