తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారనే ప్రచారం జరగడం ఈ కేసులో కీలకంగా మారింది.
ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ప్రభాకర్ రావు ఆచూకీ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసులకు స్పందన లేకపోవడంతో.. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.
అమెరికాలోని టెక్సాస్‌లో ప్రభాకర్ రావు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రభాకర్ రావు నాలుగు తరువాత ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు మరోవైపు కేసులో సాక్ష్యాలను బట్టి విచారణను వేగవంతం చేశారు.