హైదరాబాద్ – ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. తెలంగాణలో రాజకీయ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేశారంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన తిరుపతన్న 10నెలలుగా జైలులోనే ఉన్నారు.
బెయిల్ విషయమై కోర్టును తిరుపతన్న ఆశ్రయించగా విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కేసును విచారించిన ధర్మాసనం పిటిషినర్ వాదనలతో ఏకీభవించి బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయనకు ఊరట లభించినట్లు అయ్యింది. కాగా, బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతల ఒత్తిడితో అధికారులు చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. 03, డిసెంబర్ 2023న తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాడే ఆధారాలు ధ్వంసం చేశారని కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అడిషనల్ ఎస్పీ తిరుపతన్ననే అంటూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దాదాపు పది మాసాలు జైల్లో ఉన్న ఏఎస్పీ సుప్రీంకోర్టు తీర్పుతో విడుదల కానున్నారు.