హైదరాబాద్ – తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. సీఆర్‌పీసీ 73 సెక్షన్ కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసు కస్టడీలో వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించింది. కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ ఎయిర్ పోర్టులో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు, ఇంటర్‌పోల్ అధికారులను దర్యాప్తు బృదం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సీఆర్పీసీ 73 ద్వారా పోలీసులు అరెస్టు వారెంట్ తీసుకున్నారు.