అర్హులందరికీ రెండుగదుల ఇందిరమ్మ ఇండ్లు..
ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువుల భర్తీ…
పీపుల్స్ మార్చ్ కు జై కొడ్తున్న ప్రజలు…
గ్రామం మొత్తం భట్టి వెంటన నడిచిన వైనం..
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అద్భుత ఘట్టం..
మున్యాయక్ తండాలో ఆవిష్కృతం..
రోడ్డు పక్కనే సీఎల్పీ నేతకు రొట్టెలు కాల్చి పెట్టిన ఆడబిడ్డలు..
కాంగ్రెస్ రావాలంటూ మొక్కులు మొక్కిన ప్రజలు..
చివ్వెంల / సూర్యాపేట, జూన్ 26 : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండాలో అధ్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా సూర్యాపేటలో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క ఈ రోజు ఉదయం మున్యానాయక్ తండాలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు గ్రామం మొత్తం ఎదురేగివెళ్లి ఘన స్వాగతం పలికారు. చిన్న పిల్లల నుంచి పండుముసలి వరకూ.. గ్రామంలో ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొన్నారు. గ్రామం మొదలు నుంచి చివరి వరకూ.. ఆటపాటలతో కోలాటలతో పాదయాత్రగా సాగడం విశేషం.
తాండాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన బాణోత్ సుజాత, బాణోత్ దుర్గాబాయి. బాణెత్ దేవిక, బాణోత్ ప్రమీలలు రోడ్డు పక్కనే రొట్టెలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వారి వద్దకు రాగానే రోడ్డుపక్కనే రెండు మంచాలు వేసి ఆయనకు వేడివేడిగా రొట్టెలు చేసిపెట్టారు.
ఈ సందర్భంగా వారితో పాటు అక్కడున్న గ్రామస్తులంతా మూకుమ్మడిగా భట్టి విక్రమార్కతో గ్రామ సమస్యలు చెప్పారు. చదువుకున్న బిడ్డలకు కొలువులు లేవు, ఇండ్లు లేవు, గ్యాస్ ధర కొనేట్లుగాలేదు, భూములు లేవు, బతికేందుకు ఉపాధి అవకాశాలు లేవంటూ చెప్పారు.
వారినుద్దేశించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు, వంద రోజులు పనికి వెళ్లే వారికి, నిరుపేద కూలీలకు ఏడాది రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక ఇంట్లో ఉండే ఇద్దరు ముసలవ్వకు, తాతకు వృద్ధాప్య ఫించన్ ఇస్తామని, ప్రభుత్వం వచ్చిన తొలిఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని స్పష్టంగా చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
ఎస్పారెస్పీ కాలువ పరిశీలన
మున్యానాయక్ తాండా నుంచి పాదయాత్రగా వస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎస్సారెస్పీ నీటి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాట్లాడుతూ.. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన కాకాతీయ కాలువ ఎక్స్ టెన్షన్ ఫేజ్ 2 కాలువ ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పారు.