నకిరేకల్ – దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలను కోరారు… నాలుగు కోట్ల ప్రజలను తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళ తీయించారంటూ కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు.. పీపుల్స్ మార్చ్ లో భాగంగా 96వ రోజున నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో ఆయన పాదయాత్ర నిర్వహించారు.. అనంతరం ప్రజలనుదేశించి ప్రసంగిస్తూ, బీఆర్ఎస్ పాలకులు ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు..
మిగులు బడ్జెట్ ఉన్నా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా దగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆశయాలను వారి తల్లిదండ్రులు ఆశలను నిరాశ పరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. కేసీఆర్ దొర చేస్తున్న దోపిడి వల్ల సాధించుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేరడం లేదని, ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ప్రజల సంపద ప్రజలకు పంచబడదని భట్టి విక్రమార్క అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని భట్టి హామీ ఇచ్చారు. రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేస్తామని భట్టి వాగ్దానం చేశారు. కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామని, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్యను ఇంగ్లీష్ మీడియం లో అందిస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క అన్నారు.