రామంతపూర్: ఎన్నికలప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని భాజపా రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒకరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్ రామంతాపూర్ లో చేపట్టిన 48 గంటల నిరసన దీక్షలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో సాధ్యం కానీ హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిపారు.
గృహలక్ష్మి, బీసీ బంధు, దళిత బంధు పథకాలు నియోజకవర్గంలో పది మందికి కూడా ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే భారాస ప్రజాప్రతినిధులకు 30శాతం కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. అర్హులైన ప్రతిఒకరికీ రాష్ట్ర సంక్షేమ పథకాలు అదేవిధంగా పోరాటం చేస్తామన్నారు. సంక్షేమ పథకాలను ఆశ చూపి భారాసలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. కుల వృత్తులను గతంలో పట్టించుకోలేదని, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని లక్ష్మణ్ గుర్తు చేశారు.