మహేశ్వరం నియోజకవర్గములో ఏర్పాటు కావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను ఎందుకు రద్దు చేశారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నేత బండి సంజయ్ ను ప్రశ్నించారు. సరూర్ నగర్ డివిజన్ లో పెన్షన్ల పంపిణీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. గత 8 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు నయాపైసా పని చేయలేదని, నిధులు ఇవ్వడం లేదని అన్నారు. న్యాయ బద్దంగా రావాల్సిన నిధులకు, ప్రాజెక్టులకు మొండి చేయి చూపుతూ స్వార్థం కోసం, అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి ప్రాజెక్టులు, ఫండ్స్ తీసుకురాలేని బండి సంజయ్ కు పాదయాత్ర చేసే ఆర్హత లేదని, అదంతా బూటకపు యాత్ర అన్నారు సబితారెడ్డి.
పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా బండి సంజయ్‌ని ప్రజలు నమ్మరని మంత్రి సబిత విమర్శించారు. 8 సంవత్సరాలలో తెలంగాణకు బీజేపీ చేసిన మేలు ఏంటో చెప్పాలని అన్నారు. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 90వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టారన్నారు. 8 ఏళ్ల కాలంలో తాము లక్ష 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయకపోగా, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ లక్షలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్న ఘనత కేంద్రానిది అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.
ఏ హక్కుతో, ఎం చేసారని సంజయ్ ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారని సబితారెడ్డి ప్రశ్నించారు. స్థాయికి మించి విమర్శలు చేయొద్దని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. మీరు పాలిస్తున్న రాష్టాల్లో 2 వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? డయాలసిస్, బోధకాలు, ఒంటరి మహిళలకు బీజేపీ ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్నాయా? అని ప్రశ్నించారు. మీరు చేస్తున్నయాత్ర ప్రజల కోసం కాదు అని అందరికి తెలిసిపోయింది. అనవసరంగా ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే ఉరుకోబోమన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో
ఐటీఐఆర్ ను రద్దు చేసి, మరో ప్రతిష్టాత్మక ఫార్మాకు ఎలాంటి సహకారం అందించటం లేదని వ్యాఖ్యానించారు.