Wednesday, September 18, 2024

TG: సీజనల్ వ్యాధులతో జనం విలవిల.. హ‌రీశ్ రావు

ప‌డ‌కేసిన ప‌ల్లె వైద్యం
మంచ‌మెక్కిన మ‌న్యం
ఊరంతా విష జ్వ‌రాలే
ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే ఈ దుస్థితి
రేవంత్ స‌ర్కార్ పై హ‌రీశ్ రావు క‌న్నెర్న‌
వైద్య సేవ‌లు మెరుగుప‌ర‌చాల‌ని డిమాండ్

హైద‌రాబాద్ : పడకేసిన పల్లె వైద్యం, మంచమెక్కిన మన్యం, సీజనల్ వ్యాధులతో జనం విలవిల, ఊరంతా విషజ్వరాలే.. అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇలాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్లం అన్నారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

మలేరియా, డెంగీ, గన్యా వంటి విషజ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమ‌న్నారు. జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని అర్థమ‌న్నారు. పాలన గాడితప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్ తో వణికిపోతున్నార‌న్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డెంగీ కిట్స్ లేక రోగులు ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఇదంతా చూసీ చూడనట్లు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ వ్యవహరిస్తుండటం శోచనీయం అన్నారు. తప్పుడు లెక్కలు విడుదల చేస్తూ, విషజ్వరాల కేసులను తక్కువ చేసి చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు హ‌రీశ్ రావు. విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణం కోల్పోకుండా చూడాల‌న్నారు. విషజ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాల‌న్నారు.. పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాల‌ని కోరారు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement