మహబూబ్ నగర్, జులై 27 (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా గ్రామాల్లోని రైతులు, కూలీలు పొలం పనుల నిమిత్తం వాగులు, వంకలు దాటే సాహసం చేయవద్దన్నారు. కాజ్ వే లు, రహదారులు పొంగి ప్రవహించే చోట తక్షణమే వాటిని మూసివేయాలని, అంతేకాక సిబ్బందిని అక్కడ రక్షణగా ఏర్పాటు చేయాలని సూచించారు.
రోడ్లు దెబ్బతిన్నచోట ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వర్షానికి కూలిపోయేందుకు, పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాత ఇండ్లను గుర్తించి అక్కడ నివాసముండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. అదేవిధంగా వారికి పునరావాసం ఏర్పాటు చేయాలని, అత్యవసర సాయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08542- 241165 కి కాల్ చేసి సంప్రదించాలని కోరారు. వర్షాల పట్ల ప్రజలకు అండగా ఉండేలా మండల, గ్రామస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి వర్షాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఫీల్డ్ సిబ్బంది మొత్తం గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సహాయంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు వాగులు, వంకలు, నదుల్లోకి వెళ్ళవద్దని మరి మరి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలను ఎవరు తెరవవద్దని, పిల్లలు నీటి ప్రవాహాలు వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దని, తల్లిదండ్రులు పిల్లలను వర్షంలో బయటికి పంపవద్దని సూచించారు. నీరు ప్రవహించే చోట, జలపాతాలు, కోయిల్ సాగర్ వంటి పర్యాటక ప్రదేశాలను తక్షణమే ముసివేయాలని, టెలి కాన్ఫెరెన్సు ద్వారా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.